అవినీటి నల్లాలు! | - | Sakshi
Sakshi News home page

అవినీటి నల్లాలు!

May 19 2026 1:34 AM | Updated on May 19 2026 1:34 AM

అవినీటి నల్లాలు!

నగరంలో బహుళ అంతస్తులు, వాణిజ్య భవనాలకు సాధారణ కనెక్షన్లు

వరంగల్‌ అర్బన్‌: రూ.లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా ఏడాదికి రూ.12 కోట్లు గ్రేటర్‌ ఖజానాకు చేరాల్సిన సొమ్ము పక్కదారి పడుతోంది. క్షేత్రస్థాయి సిబ్బంది, ఇంజనీర్ల అవినీతి, నిర్లక్ష్యంతో గ్రేటర్‌ వరంగల్‌కు భారీస్థాయిలో ఆదాయానికి నష్టం వాటిల్లుతోందని ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా ఇంజనీర్ల సర్వేలో ఈ వాస్తవాలు వెలుగు చూశాయి.

అనధికారికంగా 8వేల వాణిజ్య నల్లా కనెక్షన్లు

వరంగల్‌ మహానగరంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు, బహుళ అంతస్తులు పెరుగుతున్నాయి. కానీ, ఆ మేరకు ఆదాయం రాబట్టుకోవడంలో అధికార యంత్రాంగం పిల్లిమొగ్గలేస్తోందని విమర్శలు ఉన్నాయి. నగరంలో 1,77,558 నల్లా కనెక్షన్లు ఉండగా.. అందులో కేవలం 629 వాణిజ్య సంస్థలకు నల్లాలు ఉన్నట్లు లెక్కలు చూపుతున్నారు. 1,200 వరకు అపార్ట్‌మెంట్లు, 400 వాణిజ్య సముదాయాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, 600 ప్రైవేట్‌ ఆస్పత్రులు, 350 ప్రైవేట్‌ పాఠశాలలు, 400 హాస్టళ్లు 400, ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాళ్లు, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, హోటళ్లు కలిపి వేలల్లో ఉన్నాయి. ఇవి కాకుండా లాడ్జిలు, ఇతర వాణిజ్య భవనాలు, పరిశ్రమల్లో అనధికారికంగా 8 వేల కనెక్షన్లు ఉన్నట్లు సమాచారం. నగరంలో ఆస్తిపన్ను కమర్షియల్‌ అసెస్‌మెంట్లు 32 వేలు ఉండగా, ట్రేడ్‌ లైసెన్స్‌లు 26వేల వరకు ఉన్నాయి.

పనిచేయని 308 నీటిమీటర్లు..

గ్రేటర్‌ పరిధిలో 629 కమర్షియల్‌ కనెక్షన్లు ఉన్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. వీటికి మాత్రమే నీటిమీటర్లు ఉన్నాయి. ఇందులో 308 నీటిమీటర్లు పనిచేయడం లేదు. ఏ వాణిజ్య నల్లా నుంచి ఎన్ని నీళ్లు వాడుకుంటున్నారో అంతుపట్టడం లేదు. వాణిజ్య నల్లాలకు వెయ్యి లీటర్లకు పెరిగిన ధరల ప్రకారం యూనిట్‌గా రూ.50 చొప్పన పన్ను విధించి పన్ను వసూలు చేస్తారు. ఏదైనా ఒక అపార్ట్‌మెంట్‌, వాణిజ్య భవనంలో నీటి మీటరు పనిచేసినప్పుడు నెలకు రూ.3 నుంచి 4వేల నల్లా పన్ను వస్తుంది. మీటర్లు పనిచేయకపోవడంతో రూ.1,500 నుంచి రూ.2వేలు చెల్లిస్తున్నారు. అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, లాడ్జీలు, షాపింగ్‌ మాల్స్‌, కాంప్లెక్స్‌ల్లో చాలావరకు నల్లాల పరిస్థితి ఇలాగే ఉంది. మరికొన్ని వాణిజ్య నల్లాలకు సాధారణ నల్లా కనెక్షన్‌ మాదిరిగా నెలకు రూ.150 చొప్పు న వసూలు చేస్తున్నారు. కాలనీల్లో ఉండే డిస్ట్రిబ్యూషన్‌ పైపులైన్ల వాణిజ్య నల్లాలకు ప్రత్యేకంగా పెద్ద పైపు వేస్తారు. ప్రతి నీటి బొట్టును లెక్కిస్తారు.

వసూళ్లలో నిర్లక్ష్యం..

ప్రతి నెల 15 నుంచి 25వ తేదీ మధ్య మీటరు రీడింగ్‌ తీయించాలి. 5వ తేదీలోపు బిల్లు చెల్లించాలి. నెలకోమారు తీసుకోవాల్సిన రీడింగ్‌ మూడు, నాలుగు నెలలకోమారు సేకరించి డిమాండ్‌ బిల్లు పంపిణీ చేస్తున్నారు. నీటి చార్జీల వసూళ్లలో నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి.

ప్రతిపాదనలోనే డిజిటల్‌ మీటర్లు

వాణిజ్య నల్లాలకు డిజిటల్‌ నీటి మీటర్ల విషయంపై 2014లో ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. ఈ మీటర్లను జీపీఆర్‌ఎస్‌ విధానం ద్వారా ఎప్పుటికప్పుడు పరిశీలించే వీలుంది. అప్పట్లో టెండర్లు పిలిచారు. ఇంజనీర్లు సీరియస్‌గా దృష్టి సారించకపోవడంతో ఈ ప్రతిపాదన మరుగున పడింది. పాడైన నీటి మీటర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసుకునేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉన్నా.. అ ధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా గ్రేటర్‌ అధికారులు దృష్టి సారిస్తే ఖజానాకు ఆదాయం చేకూరుతుంది.

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌

కార్పొరేషన్‌కు ఏటా రూ.12 కోట్ల నష్టం

ఇంజనీర్ల సర్వేలో వెలుగుచూసిన

వాస్తవాలు

Advertisement
 
Advertisement
Advertisement