30న రాష్ట్ర స్థాయి సమరభేరి | - | Sakshi
Sakshi News home page

30న రాష్ట్ర స్థాయి సమరభేరి

May 19 2026 1:34 AM | Updated on May 19 2026 1:34 AM

30న రాష్ట్ర స్థాయి సమరభేరి ఇంజనీరింగ్‌ కళాశాలకు ఏఐసీటీఈ గుర్తింపు చెట్ల కొమ్మల తొలగింపు.. రూ.30 వేల జరిమానా

హన్మకొండ అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం రైతులకిచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 30న కరీంనగర్‌లో చేపట్టే రాష్ట్ర స్థాయి ‘రైతుల మహా గర్జన సమరభేరి’ సభకు సంబంధించి ఏర్పాట్లపై సోమవారం నగరంలోని ఉమ్మడి జిల్లా రైతు ప్రజా సంఘాల నాయకులతో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల మహా గర్జన సమరభేరి సభను పార్టీలకతీతంగా చారిత్రాత్మకంగా నిర్వహిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘాల రాష్ట్ర సలహాదారు రావుల నర్సింహారెడ్డి, నాయకులు దాతారు ప్రభాకర్‌రావు, చాడ జైహింద్‌ రెడ్డి, నల్లా రాజిరెడ్డి, చకిలం రాజేశ్వర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ కోఎడ్యుకేషన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) గుర్తింపు లభించినట్లు ప్రిన్సిపాల్‌ ఎన్‌.రమణ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం అభినందించారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ ఆచార్య బి. వెంకట్రాంరెడ్డి, అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కె.భిక్షాలు, స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య పాల్గొన్నారు.

వరంగల్‌ అర్బన్‌: హనుమకొండలోని ఎన్జీఓస్‌ కాలనీలోని సుమంగళి ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో అనుమతి లేకుండా చెట్ల కొమ్మలను తొలగించిన వ్యక్తికి చెట్టుకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.30 వేల జరిమానాను హార్టికల్చర్‌ అధికారి రమేశ్‌ విధించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు చెట్లను సంరక్షించాని, చెట్ల తొలగింపు, కొమ్మల కత్తిరింపునకు సంబంధిత అధికారుల నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement