ఖిలా వరంగల్ : వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేశ్ ఆధ్వర్యంలో ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సెంట్రల్ జోన్ డీసీసీ ధార కవిత హాజరై వరంగల్ ఇన్‌చార్జ్ ఏసీపీ నర్సింహారావుతో కలిసి మాట్లాడారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించినా, గొడవల్లో తలదూరిస్తే చర్యలు తప్పవన్నారు. నేరాల జోలికి వెళ్లొద్దని కోరారు.
ఐనవోలు : సనాతన ధర్మాన్ని పాటించాలని సద్గురు లక్ష్మీనారాయణ గురుభవాని కోరారు. మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జునస్వామి ఆలయ ప్రాంగణంలో ఐనవోలు ఉపమండలం హిందూ ధర్మ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా లక్ష్మీనారాయణ గురుభవాని హాజరై మాట్లాడారు. హిందూ ధర్మం ప్రతిఒక్కరినీ ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని తెలిపారు. దేశానికి ఆత్మగా అభివర్ణించారు. హిందూ సమాజాన్ని చైతన్యం చేసి సమైక్యపర్చి దేశాన్ని విశ్వగురువుగా నిలపాలనే లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వధర్మం పట్ల అంకితభావం కలిగి ఉండాలన్నారు. పిల్లలకు భగవద్గీత, రామాయణం, మహాభారతం వంటి అంశాలను బోధించాలని సూచించారు. హిందువుల ఐక్యతే జాతీయ సమైక్యత అని అన్నారు. హిందూ సమాజ ఐక్యత, సంస్కృతి, పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు అవసరం అన్నారు. అనంతరం స్వామిజీని నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమంలో కుటుంబ ప్రభోధన్ విభాగ్ సంయోజక్ రాచకట్ల లక్ష్మణ్ సుధాకర్, సర్పంచ్‌లు గడ్డం రఘువంశీ, తదితరులు పాల్గొన్నారు.


