నల్లబెల్లి : ఇటీవల రాత్రి సమయాల్లో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై మోడెం సాయి ప్రసన్నకుమార్ కోరారు. పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటి ఆవరణలో, ఆరుబయట నిద్రించే వారిని లక్ష్యంగా చేసుకుని దొంగలు ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్నట్టు తెలిపారు. రాత్రి సమయంలో ఆరుబయట నిద్రించడం సురక్షితం కాదన్నారు. రాత్రివేళల్లో ఇంటి తలుపులు, కిటికీలు, ప్రధాన గేట్లకు లోపలి నుంచి గడియ పెట్టి సరి చూసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై డయల్ 100కు, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అవకాశం ఉన్న ప్రజలు ఇళ్ల పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
రాయపర్తి : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని కిష్టాపురం క్రాస్ రోడ్డులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట మండలంలోని దమ్మన్నపేటకు చెందిన బక్కతట్ల కుమార్ (21) బైక్‌పై తొర్రూరు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా వడ్ల లోడుతో రోడ్డు పక్కన నిలిచి ఉన్న ట్రాక్టర్‌ను వెనక నుంచి ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కుమార్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఎస్సై ముత్యం రాజేందర్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని వర్ధన్నపేట మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పరామర్శ
నర్సంపేట : పట్టణంలోని వార్డు కౌన్సిలర్ భానోతు నవీన్ నాయక్‌ను అతడి తండ్రి భానోతు భద్రు నాయక్ గతేడాది మృతి చెందిన క్రమంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. తొలుత భద్రు నాయక్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, నాయకులు మునిగాల వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆర్థికసాయం
దుగ్గొండి : మండలంలోని ముద్దునూరుకు చెందిన ఈర్ల నాగరాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబానికి అతడి పదో తరగతి నాటి మిత్రులు ఆదివారం రూ.10 వేల నగదుతోపాటు 50 కిలోల బియ్యం సాయంగా అందజేశారు. తొలుత నాగరాజు చిత్రపటానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో నాగరాజు స్నేహితులు కిషన్, అశోక్, సుమన్, యువరాజు, కుమార్, నాగరాజు, రవీందర్, సాంబరాజు, నవీన్, సాంబు, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ ఓ సిటీలో చోరీ
ఖిలా వరంగల్ : వరంగల్ ఓ సిటీలోని గుడిసెలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రూ.20 వేల నగదు, రూ.6 వేల విలువైన వెండి పట్టీలు ఆపహరించినట్లు ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం బోనోజీతండాకు చెందిన తేజావత్ రవి కుటుంబంతో కలిసి బతుకుదెరువు కోసం ఓ సిటీలోని గుడిసెలో నివాసం ఉంటున్నాడు. ఈనెల 15న రవి ఇంటికి తాళం వేసి కూలీ పనికి వెళ్లగా సాయంత్రం వచ్చే వరకు తాళం ధ్వంసం చేసి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా చోరీ వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
వ్యక్తిత్వ వికాసంపై విద్యార్థులు దృష్టి పెట్టాలి
వరంగల్ చౌరస్తా : విద్యార్థులు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని కేయూ సహాయ సబ్‌రిజిస్ట్రార్ డాక్టర్ వల్లాల పృధ్వీరాజ్ కోరారు. వరంగల్‌లోని ఆర్య సమాజ్ భవనంలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండడం అవసరమని తెలి పారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో నిర్వహకులు, స్థానిక పెద్దలు బండి కిషన్, గన్ను జయప్రకాశ్, అల్లోజు వెంకటేశ్వర్లు, లక్ష్మీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.


