కంకర రోడ్డుతో కష్టాలు | - | Sakshi
Sakshi News home page

కంకర రోడ్డుతో కష్టాలు

May 19 2026 1:22 AM | Updated on May 19 2026 1:22 AM

కంకర రోడ్డుతో కష్టాలు

రోడ్డు నిర్మించాలి

గుండెంగ– పాపయ్యపేట రోడ్డులో

గుంతలు.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

చెన్నారావుపేట : మండలంలోని పాపయ్యపేట మీదుగా వెళ్లే గుండెంగకు వెళ్లే ప్రధాన రోడ్డు కంకరతేలడంతో రాకపోకలకు కష్టాలు తప్పడం లేదు. మండల కేంద్రానికి, మహబూబాబాద్‌ జిల్లాకు వెళ్లే రహదారి కావడంతో ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తారు. కనీసం ద్విచక్ర వాహనాలు సైతం సక్రమంగా నడవలేని దుస్థితి నెలకొంది.

రోడ్డు పొడవునా గుంతలే

మండలంలోని తిమ్మరాయినిపహడ్‌ శివారు చంద్రుతండా వరకు రోడ్డు నిర్మించారు. చంద్రుతండా నుంచి పాపయ్యపేట మీదుగా పదహారు చింతల తండా మీదుగా గుండెంగ వరకు రోడ్డు నిర్మించాల్సి ఉంది. దాదాపు 6 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డుపై నడక సైతం నరకప్రాయంగా మారిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. పలుచోట్ల కంకర తేలింది. పాపయ్యపేట, పుల్లయబోడుతండా, 16 చింతలతండా, ధర్మతండా, బోడమాణిక్యంతండా, గుడితండా తదితర గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వెళ్లాలంటే ఈ రోడ్డే ఆధారం. నిత్యం ప్రయాణికులతో బిజీగా ఉండే రోడ్డు కావడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైతులు పంట ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాలకు, మార్కెట్‌కు తరలించాలంటే ట్రాక్టర్లు , లారీలు వెళ్లడానికి నానా అగచాట్లు తప్పడం లేదు. రోడ్డు గుంతలమయంగా ఉండటంతో ట్రాక్టర్లలోంచి ధాన్యం బస్తాలు కిందపడిపోతున్న దుస్థితి నెలకొంది. విద్యార్ధులు స్కూల్‌కు వెళ్లాలన్నా ఇబ్బందిగానే ఉంది. ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగించే ప్రజలు నడుము నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

రాత్రివేళల్లో ప్రయాణంతో బెంబేలు

అత్యవసర పరిస్థితుల్లో రాత్రివేళల్లో రాకపోకలు సాగించాలంటే జనం బెంబేలెత్తుతున్నారు. కంకర తేలిన రోడ్డుపై లైట్లు సైతం లేకపోవడంతో నడిచి వెళ్లాలన్నా ఇబ్బందిగానే ఉంది. ద్విచక్ర వాహనాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఆటోలు, ఇతర వాహనాలు రాలేని పరిస్థితి నెలకొంది.

పాపయ్యపేట నుంచి గుండెంగ వరకు శాశ్వత ప్రాతిపదికన రోడ్డు నిర్మించాలి. విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూల్‌ బస్సులు కూడా నడవని దుస్థితి నెలకొంది. రోడ్డును వెడల్పు చేయడంతోపాటు నిర్మించాలి. రాత్రివేళల్లో రోడ్డులో ప్రయాణించాలంటే జనం బెంబేలెత్తుతున్నారు. నడిచి వెళ్లాలన్నా ఇబ్బందిగానే ఉంది.

– విక్రమ్‌, సర్పంచ్‌, 16 చింతల తండా

Advertisement
 
Advertisement
Advertisement