● ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భిక్షపతి
నర్సంపేట : కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన పంటల మద్దతు ధర అశాస్త్రీయంగా ఉందని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి తెలిపారు. పట్టణంలోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో అధ్యక్షుడు జక్కుల తిరుపతి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గ సమావేశానికి భిక్షపతి హాజరై మాట్లాడారు. మోదీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన మద్దతు ధర రైతులకు మేలు చేకూర్చేలా లేదన్నారు. గడచిన ఏడాది వ్యవధిలో ఎరువులు, పురుగు మందుల ధరలు భారీగా పెరగడంతో దుక్కి దున్నినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతులు పెట్టే పెట్టుబడి భారీగా పెరిగిందని చెప్పారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులపై సుంకం లేకపోగా భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి చేసే పంట ఉత్పత్తులపై 18 శాతం పన్ను విధిస్తుండడంతో రైతులు పంటల ఎగుమతి చేస్తే ఆర్థికంగా నష్టపోయే దుస్థితి ఉందంటూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఉదహరించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మద్దతు ధర నిర్ణయించడంతోపాటు పంట ఉత్పత్తుల విక్రయంలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు గట్టి కృష్ణ, సహాయ కార్యదర్శి బొమ్మిడి సాంబయ్య, సభ్యులు ఐలయ్య, రమేశ్, భద్రాజి, కృష్ణ, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.


