నర్సంపేట : పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో దళారీ వ్యవస్థను నిర్మూలించాలని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజావత్ వాసునాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలోని బృందం స్థానిక ఆర్డీఓకు బుధవారం వినతిపత్రం అందజేసింది. అనంతరం వాసు మాట్లాడారు. మార్కెట్లో కాంటా వేసిన బస్తాలను భద్రపర్చాలని, వేలిముద్రల కౌంటర్ల సంఖ్య పెంచడంతోపాటు గన్నీ బ్యాగులు అందించాలని, వర్షానికి మక్కలు తడవకుండా పరదాలు సమకూర్చాలని, మక్కలను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ధారావత్ సుభాష్, టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బోడ బాబు, గోర్ సిక్‌వాడీ నాయకుడు సంతోశ్, సేవాలాల్ సేవ జిల్లా అధ్యక్షుడు చందులాల్, నాయకులు రాములు, వెంకన్న, చంద్రశేఖర్, రమేశ్, రాజు, శ్రీనివాస్, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.


