చెన్నారావుపేట : వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నమిండ్ల స్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ శివానంద్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం స్వామి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. పాత విధానంలోనే ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను పునరుద్ధరించాలని, కూలీలకు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా కూలి రూ.600లకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు వమొగులోజు శారద, బూడిద యాదమ్మ, మండల స్వరూప, బల్లె చంద్రకళ, మాదాసి రజిత తదితరులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో
దుక్కిటెద్దు మృతి
రాయపర్తి : విద్యుదా ఘాతానికి గురై దుక్కిటెద్దు మృతి చెందిన ఘటన బాలాజీ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మర్రి తండాలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బానోతు సోమన్న సాకుతున్న లక్ష రూపాయల విలువైన దుక్కిటెద్దు బుధవారం మేతకు వెళ్లింది. ఈ క్రమంలో వ్యవసాయ భూమిలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలోని వైర్లకు తగిలి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే దుక్కిటెద్దు మృతి చెందిందని సోమన్న వాపోయాడు. బాధిత రైతును సర్పంచ్ మోహన్‌లాల్ పరామర్శించారు. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.


