సమస్యలను సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

May 12 2026 1:26 AM | Updated on May 12 2026 1:26 AM

అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌

ప్రజావాణిలో 121 దరఖాస్తులు

న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన వినతులను సమగ్రంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌ అన్నారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశాల మేరకు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రీవెన్స్‌లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌ లేకుండా తక్షణమే పరిష్కరించాలన్నారు. మొత్తం 121 దరఖాస్తులు రాగా రెవెన్యూ 62, జీడబ్ల్యూఎంసీ 32, వివిధ శాఖలకు సంబంధించినవి 28 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్‌ చేశారు. అలాగే రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో నిర్వహించిన ప్రజావాణిలో వరంగల్‌ 31, నర్సంపేటలో 14 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో డీపీఓ కల్పన, డీఆర్‌డీఓ నాగపద్మజ, హౌసింగ్‌ పీడీ దామోదర్‌, అధికారులులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేర్చి

పూర్తి చేయాలి

గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన ఇళ్లు పునాది, పిల్లర్ల వరకు నిర్మించాం. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటి వరకు బిల్లులు రావడం లేదు. ఇబ్బందులు పడుతున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేర్చి పూర్తి చేసి న్యాయం చేయాలి.

–తిరుమలాయపల్లి గ్రామస్తులు, రాయపర్తి

తప్పుడు రిపోర్టు ఇచ్చిన అధికారిపై చర్య తీసుకోవాలి

తనకు వారసత్వంగా రావాల్సిన అసైన్డ్‌ భూమిని అక్రమంగా ఇతరులు ఆక్రమించే విధంగా తప్పుడు రిపోర్టు ఇచ్చిన జీపీఓ, ఆర్‌ఐలపై చర్య తీసుకోవాలి. ఈ విషయమై గతంలో కలెక్టర్‌ ప్రజావాణిలో వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదు. న్యాయం చేయాలి.

–బానోత్‌ రవికుమార్‌, నర్సక్కపేట, నల్లబెల్లి

Advertisement
 
Advertisement
Advertisement