సాక్షి, వరంగల్/గీసుకొండ: కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా 5ఎఫ్ (ఫామ్ టు ఫైబర్.. టు ఫ్యాక్ట రీ.. టు ఫ్యాషన్...టు ఫారిన్) దృక్కోణంతో ఓరుగల్లు ఖ్యాతి ప్రపంచానికి తెలిసేలా మరో అడుగు ముందుకు పడింది. పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతుల దాకా ఒకే వేదికపై పూర్తి విలువ వ్యవస్థను కల్పించేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌తో పాటు తెలంగాణ నుంచి వరంగల్‌లోకి కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును పీఎం మిత్ర (ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్కు) పథకం కింద 2023లో ఎంపిక చేశారు. ఈ మేరకు రూ.200 కోట్లతో కూడిన అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వేదికగా ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పటికే విడుదల చేసిన రూ.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా, మరో రూ.170 కోట్ల దఫాల వారీగా కేంద్రం రాష్ట్రానికి అందివ్వనుంది. దీంతో పాటు ‘కాంపిటిటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్’ కింద రూ.300 కోట్ల వరకు ప్రోత్సాహక మద్దతు ఇవ్వనుండడంతో దేశ, విదేశీ కంపెనీలు ఇక్కడికి క్యూ కట్టే అవకాశం ఉంది. గీసుకొండ, సంగెం మండలాల్లోని శాయంపేట హవేలీలో మొత్తం 1,327 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ పార్కులో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. శూన్య ద్రవ వ్యర్థ సాంకేతికతతో నిర్మించిన సార్వత్రిక ద్రవ వ్యర్థాల శుద్ధి ప్లాంటు (సీఈటీపీ)కు సుస్థిర అభివృద్ధిని అందించనుంది. ఇప్పటివరకు ఈ పార్కులో 548 ఎకరాల్లో పరిశ్రమలు వస్తే పీఎం మిత్ర కింద కేఎంటీపీ ఎంపికై న తర్వాతనే 310 ఎకరాల్లో పరిశ్రమలు వచ్చాయని కేంద్ర జౌళి పరిశ్రమ మంత్రిత్వ విభాగాధికారులు అంటున్నారు. ఇందులో భాగంగానే ‘ఎవర్‌టాప్ టెక్స్‌టైల్ అండ్ అపెరెల్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ వంటి సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకు రావడం దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.1695.54 కోట్ల వ్యయం కాగా, వివిధ మార్గాల ద్వారా రూ.6,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ పార్కు ద్వారా 24,400కు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వార్షికంగా రూ.1,990 కోట్ల వ్యాపార లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో ఉన్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, ‘పీఎం మిత్ర’ హోదాతో జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుని, అంతర్జాతీయ జౌళి మ్యాప్‌పై వరంగల్‌కు ప్రత్యేక స్థానం కల్పించనుంది. చారిత్రక కాకతీయ నగరం ఇప్పుడు పారిశ్రామిక, జౌళి రంగంలోనూ ప్రపంచ స్థాయి గుర్తింపును అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ పార్కు దేశంలోనే తొలి పీఎం మిత్ర పార్కుగా నిలవడం తెలంగాణకు, ముఖ్యంగా వరంగల్‌కు విశేష గౌరవంగా పేర్కొనవచ్చు. 2017లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం, నాటి సీఎం కేసీఆర్ ఈ పార్కును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కై టెక్స్, యంగ్‌వన్, గణేశా కంపెనీలు ఉత్పత్తులు ప్రారంభించాయి.
పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ
ఎగుమతులు ఒకే వేదికపై..
కేఎంటీపీకి పీఎం మిత్ర కింద రూ.200 కోట్లు, సీఐఎస్ కింద రూ.300 కోట్లు
వర్చువల్‌గా హైదరాబాద్ నుంచి
ప్రారంభించిన పీఎం నరేంద్రమోదీ
అంతర్జాతీయ జౌళి మ్యాప్‌పై ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం దిశగా అడుగులు


