లీకేజీ.. టేకిటీజీ! | - | Sakshi
Sakshi News home page

లీకేజీ.. టేకిటీజీ!

May 9 2026 7:14 AM | Updated on May 9 2026 7:14 AM

సాక్షి, వరంగల్‌: జిల్లాలోని వరంగల్‌ నగరం, నర్సంపేట మున్సిపాలిటీలో తాగునీటి తిప్పలు తప్పడం లేదు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 28 డివిజన్లు, నర్సంపేటలో 30 వార్డులు, వర్ధన్నపేటలో 12 వార్డులు ఉన్నాయి. కొన్ని కాలనీలు వాటర్‌ ట్యాంకర్లపై ఆధారపడుతున్నాయి. అమృత్‌ పథకం, మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటా నల్లా కనెక్షన్‌ ఉన్నా కొన్ని చోట్ల పైపులైన్ల లీకేజీలతో నీరు డ్రెయినేజీల్లోకి వృథాగా పోతుండడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. వరంగల్‌ మహానగరం, నర్సంపేట మున్సిపాలిటీలోని విలీన గ్రామాలకు సరిగా నీరందడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. వరంగల్‌ నగరానికి రోజుకు 80 ఎఎంల్‌డీల (80,00,000 లీటర్ల) నీరు, నర్సంపేటలో 7.36 ఎంఎల్‌డీల (7,36,000 లీటర్లు) నీరు, వర్ధన్నపేటలో 2.16 ఎంఎల్‌డీల నీరు అవసరం ఉంది.

ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి

దేశాయిపేట ఫిల్టర్‌బెడ్‌కు..

వరంగల్‌ నగరానికి ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి దేశాయిపేట ఫిల్టర్‌బెడ్‌కు నీరు వస్తుంది. అక్కడ ఫిల్టర్‌ చేసి నీటిని సరఫరా చేస్తారు. అలాగే, ధర్మసాగర్‌ ఫిల్టర్‌బెడ్‌ నుంచి కడిపికొండ మీదుగా ఉర్సు కరీమాబాద్‌, అండర్‌ రైల్వే గేట్‌ ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతోంది. శివనగర్‌, ఖిలా వరంగల్‌ ఎస్సీవాడ, పుప్పాలగుట్ట, పైడిపల్లి, కొత్తపేట తదితర ప్రాంతాలకు సరిపడా నీరు రావడం లేదన్న విమర్శలొస్తున్నాయి. నర్సంపేటకు పాకాలవాగు నీటిని పంపింగ్‌ చేసి ఆ తర్వాత ఫిల్టర్‌ చేసి సరఫరా చేస్తున్నారు. కొన్ని వార్డులకు ఈ నీరు వెళ్తుండగా, మరికొన్ని వార్డులకు నేరుగా రా వాటర్‌ వెళ్తోంది. సమస్యలున్న ప్రాంతాల్లో సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నీటిని సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

నర్సంపేటలో పరిష్కారం కాని

తాగునీటి సమస్య

నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీలోని ప్రధాన రహదారుల వెంట పైపులైన్ల లీకేజీలతో తాగునీరు వృథాగా పోతోంది. దీంతో అన్ని కాలనీలకు నీరు సరఫరా కావడం లేదు. మల్లంపల్లి రోడ్డులో ఐదు సంవత్సరాలుగా లీకేజీ అవుతున్న పైపులైన్‌ను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇటీవల మరమ్మతు చేయించారు. మిషన్‌ భగీరథ నీరు పూర్తిస్థాయిలో సరఫరా కావడం లేదు. దీంతో రెండు రోజులకోసారి నల్లాల ద్వారా నీటిని అందిస్తున్నారు. వేసవి ప్రణాళికలో భాగంగా రూ.34 లక్షలతో తాగునీటి సమస్యలు పరిష్కరిస్తున్నారు. 60 సమస్యలు పరిష్కారం కాగా.. 40 సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.

సమయం సరిపోక..

గత పాలకవర్గం హయాంలో తాగునీటి సమస్య జఠిలమైంది. నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి నీటి సమస్య వివరించింది. ఖానాపురం మండలం అశోక్‌నగర్‌ గ్రామంలో ఉన్న డీఫ్లోరైడ్‌ ప్రాజెక్టు పనులను పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రూ.50 లక్షలు అత్యవసరంగా అందించే ప్రయత్నం ఎమ్మెల్యే చేశారు. పనులు పూర్తయ్యే సరిగా ఆరు నెలల సమయం పడుతుందని అధికారులు చెప్పారు. దీంతో సమయం సరిపోక ఈ వేసవిలో పనులు చేపట్టలేదు.

నీరు వృథాగా పోతున్నా

పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు

వేసవిలో శివారుకాలనీలకు

అందని తాగునీరు

వరంగల్‌, నర్సంపేటలో

ప్రజల ఇబ్బందులు

Advertisement
 
Advertisement
Advertisement