● మక్కలు కొనకుంటే ధర్నా చేస్తాం
● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
రాయపర్తి: ప్రభుత్వానికి వారం రోజుల టైం ఇస్తున్నాం.. ఆలోగా మక్కల కొనుగోళ్లు చేయకుంటే ఐదు వేల మంది రైతులతో ధర్నా చేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఎదుట ఉన్న వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై శుక్రవారం ఆయన రైతులతో ధర్నా చేశారు. అనంతరం మార్క్‌ఫెడ్ అధికారులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండానే రైతుల పంటలు కొనుగోలు చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర పోయి రైతులకు కనీసం గన్నీ బ్యాగులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షుడు నర్సింహానాయక్, మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, నాయకులు కర్ర రవీందర్‌రెడ్డి, రంగారెడ్డి, గారె నర్సయ్య, ఐత రాంచందర్, ఎల్లగౌడ్, రైతులు పాల్గొన్నారు.
రైతు సమస్యలను విస్మరించిన ప్రభుత్వం
నెక్కొండ: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలను విస్మరించిందని ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. సాయిరెడ్డిపల్లి శివారులోని వీకేఆర్ గోదాంతోపాటు మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం మక్కలు, ధాన్యం కొనుగోళ్లు చేయకుండా రైతు ఉత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ విధానాలతో విసుగెత్తిన రైతులు తక్కువ ధరకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునే పరిస్థితులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మక్కలు, ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.


