గీసుకొండ: మండలంలోని శాయంపేటహవేలిలో కొలువైన పాంచాల రాయస్వామి జాతర బుధవారం వైభవంగా సాగింది. భక్తులు సమీప గ్రామాల నుంచి తరలివచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, తహసీల్దార్లు రియాజుద్దీన్, రాజ్‌కుమార్ పలు శాఖల అధికారులకు అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగ తం పలికారు. గ్రామ సర్పంచ్ యాక య్య, మాజీ ఎంపీపీ ముంత కళావతిరాజయ్య, బీఆర్‌ఎస్ యూత్ నాయకులు ఎండీ అజారుద్దీ న్, కొంగర సుదర్శన్, ముంత ప్రవీణ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గురువారం స్వామివారి నాగవెల్లి అనంతరం బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని అర్చకులు తెలిపారు.
దరఖాస్తు గడువు పొడిగింపు
న్యూశాయంపేట: షెడ్యూల్డ్ కులాల వార్షిక ప్రణాళిక 2025–26లో పథకాల దరఖాస్తుకు ఈనెల 8వ వరకు గడువు పొడిగించినట్లు షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ కార్యనిర్వహణ సంచాలకుడు సురేశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ నిరుద్యోగ యువతకు మరిన్ని పథకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం హనుమకొండ సుబేదారి సర్క్యూట్‌హౌస్ రోడ్డులోని తుషారా స్కూల్ ఎదుట ఉన్న కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.
కాశిబుగ్గ: సీకేఎం ప్రసూతి ఆస్పత్రిని వరంగల్ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ (స్థానిక సంస్థలు) బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన నేరుగా ఓపీ విభాగాలను పరిశీలించి, సమస్యలు తెలుసుకున్నారు. ఓపీ విభాగాల్లో అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పేషంట్లకు గతంలో ఒక ఓపీ కౌంటర్ ఉండగా.. కలెక్టర్ ఆదేశాల మేరకు రెండు ఓపీ కౌంటర్లు పనిచేస్తున్నాయి. దీంతో పేషంట్లకు కొంతవరకు ఇబ్బందులు తగ్గడంతో ఉపశమనం ఏర్పడింది. సూపరింటెండెంట్ చాంబర్‌లో డీఎంహెచ్‌ఓ సాంబశిరావుతో పాటు అధికారులు, వైద్య సిబ్బంది దవాఖాన సమస్యలపై సమీక్షించారు.
హన్మకొండ: అన్‌మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ మృతి ఘటనలో ఇద్దరు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ యాదవనగర్ సెక్షన్‌కు చెందిన అన్‌మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ గాదె పున్నం చందర్ సోమవారం నిచ్చెన సాయంతో స్తంభంపైకి ఎక్కి విద్యుత్ సర్వీస్ డిస్‌కనెక్షన్ చేస్తుండగా షాక్‌కు గురై కింద పడిపోయాడు. తలకు బలమైన గాయమైంది. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనకు యాదవనగర్ సెక్షన్ లైన్ ఇన్‌స్పెక్టర్ డి.వేణు, లైన్‌మెన్ జి.శ్రీనివాస్‌రావును బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేశారు. ఈమేరకు ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి మెమో జారీ చేశారు.


