ఈసారైనా విదిల్చేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్:
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు(ఆదివారం) ప్రవేశపెట్టే 2026–27 బడ్జెట్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఏ మేరకు నిధుల వాటా దక్కనుంది? అన్న చర్చ ప్రధానాంశమైంది. ఈసారైనా కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపుల విషయమై సీతమ్మ కరుణిస్తుందన్న ఆశతో ఓరుగల్లు ప్రజలు ఎదురు చూస్తున్నారు. 2025–26 కేంద్ర బడ్జెట్ ఊరించి.. ఉసూరుమనిపించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ఉమ్మడి వరంగల్‌కు నేరుగా పద్దులేవీ ప్రకటించలేదు. పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యంతో ఈ బడ్జెట్‌ను రూపకల్ప న చేసినట్లు చెప్పినా.. నేరుగా ఆ వర్గాలకు చెందిన అందరికీ మేలు జరిగే పరిస్థితి కనిపించలేదు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన కాజీపేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ, కాకతీయ టెక్స్‌టైల్ పార్కుకు పీఎం మిత్ర హోదా, నిధుల కేటాయింపు, ములుగు ట్రైబల్ యూనివర్సిటీ, వరంగల్ నగరంలో నియో రైలు, భూగర్భ డ్రెయినేజీ, ఎయిర్‌పోర్ట్ బడ్జెట్‌లో ప్రస్తావనకు రాలేదు. హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నా.. బడ్జెట్‌లో ఆ మే రకు నిధులివ్వలేదు. ఫలితంగా అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉంటున్నాయి. ఈసారి బడ్జెట్‌లోనైనా ప్రాధాన్యమిస్తారా? అన్న చర్చ జరుగుతోంది.
కీలక ప్రాజెక్టులపై చిన్నచూపు..
ములుగు ట్రైబల్ యూనివర్సిటీ, వరంగల్ నగరంలో నియో రైలు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఎయిర్‌పోర్ట్ తదితర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలన్న ప్రతిపాదనలకు మోక్షం కలగడం లేదు. పలు ప్రతిష్టాత్మక పథకాలకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు జరగకపోవడంపై ప్రజలు ప్రతీసారి పెదవి విరుస్తున్నారు. కాజీపేట రైల్వే కోచ్‌ను ఈ ఏడాది ఆగస్టు వరకు పూర్తి చేయాల్సి ఉన్నా.. గత బడ్డెట్‌లో నేరుగా పద్దుల్లో చేర్చకపోవడం వల్ల పూర్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు రూ.350 కోట్లు ఇవ్వాలని చేసిన ప్రతిపాదనలు గత బడ్డెట్‌లో బుట్టదాఖలే అయ్యాయి. లెదర్ పార్కు, సైనిక్ స్కూల్‌తో పాటు వివిధ పథకాల కోసం చేసిన ప్రతిపాదనలను పట్టించుకోకపోగా.. రూ.4,174 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిధుల్లో కేంద్రం వాటా తేలలేదు. ఈసారి నిధులిచ్చి వాటాను క్లియర్ చేయాలని కోరుతున్నారు. నిధులు కేటాయించని కారణంగా సైనిక్ స్కూల్‌ను ఇతర జిల్లాలకు తరలించాలని చూస్తున్నారు.
రైల్వేశాఖకు
కేటాయింపులపై ఆశలు..
ఈసాధారణ బడ్జెట్‌లోనైనా రైల్వేశాఖకు కేటాయింపులు జరిగితే పలు కొత్త, అసంపూర్తి రైల్వేలైన్లకు మోక్షం కలుగుతుంది. మణుగూరు–రామగుండం రైల్వేలైన్ సర్వే కోసం గతంలో బడ్జెట్ కేటాయించారు. ఆ మేరకు భూసేకరణ, నిర్మాణం పూర్తి కోసం నిధులు ఇవ్వలేదు. హసన్‌పర్తి–కరీంనగర్, డోర్నకల్–మిర్యాలగూడ రైల్వేలైన్ల సర్వే, భూసేకరణ, నిర్మాణం కోసం చేసిన కేటాయింపులు పెరగాల్సి ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన రైల్వే కోచ్‌ఫ్యాక్టరీని పూర్తి చేసేందుకు ఆ మేరకు నిధులు ఇవ్వాల్సి ఉంది. కాజీపేట రైల్వే టౌన్ స్టేషన్, రైల్వే ఆస్పత్రిని సబ్ డివిజన్ ఆస్పత్రి మార్పుపైన ఆశలు ఉన్నాయి. స్టేషన్‌ఘన్‌ఫూర్ నుంచి సూర్యాపేట వరకు కొత్త లైన్‌కు నిధులివ్వడంతో పాటు కాజీపేట జంక్షన్ నుంచి ముంబై. విజయవాడ, కాగజ్‌నగర్ వరకు మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించాలన్న డిమాండ్ ఉంది. కాగా, గ్రేటర్ వరంగల్ నగర అభివృద్ధి కోసం స్మార్ట్‌సిటీ గడువును పెంచి అదనంగా నిధులు కేటాయించాలని నగరవాసులు కోరుతున్నారు.
నేడు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్.. నిర్మలమ్మపైనే ఆశలు
ట్రైబల్ యూనివర్సిటీ, కోచ్‌ఫ్యాక్టరీ పూర్తికి నిధులు అవసరం
ఉమ్మడి వరంగల్‌లో కీలక ప్రాజెక్టులు పెండింగ్
రైల్వే లైన్లు, స్టేషన్లకు
విడుదల కాని నిధులు
గత బడ్జెట్‌లో ప్రతిపాదించినా దక్కని ప్రాధాన్యం
ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర ప్రాజెక్టులకు కేటాయింపులపై ఆశలు
ఈసారైనా విదిల్చేనా?


