ముగిసిన నామినేషన్ల పరిశీలన
పరకాల: పరకాల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అధికారులు నామినేషన్ల పరిశీలనతోపాటు పోటీకి అర్హుల జాబితాను శనివారం సాయంత్రం ప్రకటించారు. మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులున్నాయి. ఒక్కో వార్డు నుంచి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు సైతం చాలా మంది నామినేషన్లు వేశారు. 22 వార్డులకు మొత్తం 215 నామినేషన్లు దాఖలు కాగా, వారిలో 2 నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరించడంతో పాటు (రెండు నామినేషన్లును ఒకటిగా పరిగణించడంతో 174 మంది అభ్యర్థుల నామినేషన్ల పత్రాలు మాత్రమే అర్హత సాధించినట్లు పరకాల మున్సిపల్ కమిషనర్ ఎస్.అంజయ్య తెలిపారు. పోటీకి అర్హత సాధించిన వారి జాబితాను పరకాల మున్సిపల్ కార్యాలయంలో ప్రదర్శించారు. బీజేపీకి చెందిన ఇద్దరు అభ్యర్థుల(10,14 వార్డులు)కు సంబంధిత నామినేషన్లు తిరస్కరించడంతో ఆ పార్టీ నాయకులు షాక్ తిన్నారు.
బీఆర్‌ఎస్ నాయకుల ఆందోళన
14వ వార్డులో బీజేపీ అభ్యర్థి సిరంగి భాగ్యలక్ష్మి నామినేషన్ పత్రాల్లో రెండు చోట్ల సంతకం చేయకపోవడంతో మొదట తిరస్కరణకు నిర్ణయించిన అధికారులు.. ఆతర్వాత మరో పేపర్‌పై సంతకం పెట్టి బీజేపీ నాయకులు జత చేసే ప్రయత్నం చేశారంటూ బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు అధికారులు మాత్రం 14వ వార్డులో బీజేపీ అభ్యర్థి సిరంగి భాగ్యలక్ష్మి నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు పేర్కొనడంతో సమస్య సద్దుమణిగింది.
ఎన్నికల్లో పోటీకి అర్హత సాధించిన
174 మంది
వివిధ కారణాలతో 2 తిరస్కరణ
ముగిసిన నామినేషన్ల పరిశీలన


