సరస్వతీదేవిగా రుద్రేశ్వరి అమ్మవారు
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో వసంత పంచమిని పురస్కరించుకుని శుక్రవారం సరస్వతీ అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. వందలాది మంది భక్తులు, విద్యార్థులు దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం రుద్రేశ్వరీ అమ్మవారిని శ్రీసూక్తంతో నారీకేళ జల పంచామృతాభిషేకం నిర్వహించి సరస్వతీదేవిగా అలంకరించి పూజలు జరిపారు. విద్యార్థులు సరస్వతీదేవి నామాలను పటిస్తూ ప్రార్థన చేశారు. ఈసందర్భంగా ఆలయ ఈఓ అనిల్‌కుమార్ విద్యార్థులకు సరస్వతీదేవి శ్లోకాల పుస్తకాలు అందజేశారు. ప్రతీరోజు శ్లోకాలను పఠించడం ద్వారా మానసిక ప్రశాంతత కలిగి చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని గంగు ఉపేంద్రశర్మ విద్యార్థులకు వివరించారు,
ఎంజీఎం: మాతాశిశు సంరక్షణే ప్రధాన ధ్యేయమని హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య సూచించారు. వరంగల్ డీఎంహెచ్‌ఓ కాన్ఫరెన్స్ హాల్‌లో హనుమకొండ జిల్లాలోని ఏఎన్‌ఎంలకు ‘సమీకృత అధిక ప్రమాద గర్భధారణ నివారణ నియమాలు–హైరిస్క్ ప్రెగ్నెన్సీ’పై శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి డీఎంహెచ్‌ఓ అప్పయ్య హాజరై మాట్లాడుతూ.. గర్భిణుల్లో ప్రమాద సూచికలను గుర్తించడానికి ఏఎన్‌ఎంలకు శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రమాదకర లక్షణాలు ఏఎన్‌ఎంలు ముందే గుర్తిస్తే గర్భిణులకు ప్రత్యేక వైద్యసేవలు అందించవచ్చని చెప్పారు. అర్మాన్ శిక్షణ సంస్థ కన్సల్టెంట్ డాక్టర్ సౌజన్య హైరిస్క్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. శిక్షణ పొందిన ఏఎన్‌ఎంలకు డీఎంహెచ్‌ఓ అప్పయ్య చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అర్మాన్ సంస్థ నుంచి డాక్టర్ కె.ప్రసాద్, డెమో వి.అశోక్‌రెడ్డి, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్నకుమార్, డీడీఎం ప్రవీణ్, హెచ్‌ఈఓ సీహెచ్ రాజేశ్వర్‌రెడ్డి, వినోద్, రంజిత్ పాల్గొన్నారు.
హన్మకొండ కల్చరల్: వరంగల్ ఎంజీఎం ఎదుట ఉన్న శ్రీరాజరాజేశ్వరీదేవి ఆలయంలో శిశిర నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదో రోజు శుక్రవారం అమ్మవారిని ఆలయ అర్చకుడు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ వహ్నివాసినిగా అలంకరించి పూజలు చేశారు.
కాజీపేట అర్బన్: నిట్ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో రెండు రోజుల థర్మల్ సైన్స్ అండ్ సస్టేనబుల్ ఎనర్జీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ శుక్రవారం ప్రారంభమైంది. మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వేదికగా నిలవాలని అన్నారు. కార్యక్రమంలో నిట్ ప్రొఫెసర్లు సోనావానే శిరీశ్, రవికుమార్, అంబ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సరస్వతీదేవిగా రుద్రేశ్వరి అమ్మవారు
సరస్వతీదేవిగా రుద్రేశ్వరి అమ్మవారు
సరస్వతీదేవిగా రుద్రేశ్వరి అమ్మవారు


