రెబల్స్.. పార్టీలోకి రండి!
సాక్షిప్రతినిధి, వరంగల్ :
గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద తప్పలేదు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు ఆశించిన పలువురు.. చివరికి వరకు ఫలితం కనిపించకపోవడంతో చేసేది లేక తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీలోకి దిగారు. రెబల్స్ ధాటికి పలుచోట్ల అధికార పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టగా.. పలుచోట్ల రెబల్స్ విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్‌లో ఆదివారం జరిగిన రెండో విడతలో 563 పంచాయతీల్లో 41 మంది రెబల్స్‌గా గెలిస్తే.. హనుమకొండ జిల్లాలో ఆరు ఏకగ్రీవంకాగా, 67 స్థానాలకు ఏడు చోట్ల తిరుగుబాటు అభ్యర్థులు గెలుపొందారు. హనుమకొండ జిల్లాలో గెలిచిన వారిని ఇప్పుడు సొంతగూటికి రమ్మని నేతలు ఆహ్వానిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
వేలేరు, హసన్‌పర్తిలలో షాక్...
అభ్యర్థుల ఎంపికలో ఏమరుపాటు అధికార కాంగ్రెస్‌కు షాక్ తగిలేలా చేసింది. ఆదివారం జరిగిన పోలింగ్ సందర్భంగా హనుమకొండ జిల్లాలో ముగ్గురు స్వంతంత్రులు గెలుపొందగా, ఏడుగురు కాంగ్రెస్ రెబల్స్ విజయఢంకా మోగించారు. సుమారు 4,800 ఓటర్లున్న వేలేరు గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను ఓడించి భారీ షాక్ ఇచ్చారు. ఇక్కడ మూడు ముక్కలాట ఆడారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులుగా విజయపురి మల్లికార్జున్ గెలుపు కోసం స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రచారం చేశారు. మరో అభ్యర్థి సద్దాం హుస్సేన్ కోసం రాష్ట్ర సహకార అయిల్ సీడ్స్, గ్రోయర్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్న బిల్ల యాదగిరి 9 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం సంచలనగా మారింది.
● హసన్‌పర్తి మండలంలోని నాలుగు చోట్ల రెబల్స్ గెలిచి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చారు.
● హసన్‌పర్తి మండలం మల్లారెడ్డి పల్లెలో మేడిపల్లి సునితకు అధికార పార్టీ మద్దతు తెలపగా రెబల్ అభ్యర్థి గాజుల కృష్ణవేణి గెలుపొందారు.
● హరిశ్చంద్రనాయక్ తండాలో భూక్యా రాజు రెబల్ అభ్యర్థి నునావత్ దేవందర్ చేతిలో ఓడిపోగా, బైరాన్‌పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి కల్లెబోయిన కుమారస్వామి రెబల్ అభ్యర్థి కల్లెబోయిన సురేందర్ చేతిలో ఓటమి చెందారు.
● సూదనపల్లిలో కాంగ్రెస్ మద్దతుదారు తిక్క మాధవి రెబల్ అభ్యర్థి ఆకారపు లచ్చమ్మ చేతిలో రెండోట్ల తేడాతో అపజయం పాలయ్యారు.
● ధర్మసాగర్ మండలం రాపాకపల్లి గ్రామంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కందుకూరు సుధాకర్ రెబల్ అభ్యర్థి కందుకూరి జయందర్ చేతిలో ఓడిపోయారు.
● ఐనవోలు మండలం ఒంటిమామిడి, లింగమోరి గూడెంలలో ఇదే జరిగింది. ఇప్పుడు రెబల్స్ అందరినీ పార్టీలో చేరాలని నేతలు ఆహ్వానిస్తుండగా.. పార్టీ పరంగా మద్దతు తెలిపి బరిలోకి దింపిన నాయకులు రెబల్స్‌ను అదుపు చేయకపోవడం వల్ల ఓటమి చెందాల్సి వచ్చిందని ఓడిపోయిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘కారు’ మరింత కలబడితే..
ఇంకా ‘చేయి’జారేవి..
పొరుగు జిల్లా జనగామ ఫలితాల ప్రభావం హనుమకొండ జిల్లాలోనూ పడినట్లు ఫలితాలను బట్టి అవగతమవుతోంది. మిగతా మండలాల్లోనూ బీఆర్‌ఎస్ పార్టీ నాయకత్వం గట్టిగా కృషి చేస్తే మరిన్ని స్థానాలు దక్కేవన్న చర్చ జరుగుతోంది. రెండో విడతలో మొత్తంగా 73 గ్రామ పంచాయతీల్లో 39 కాంగ్రెస్, 22 బీఆర్‌ఎస్, రెండు బీజేపీ మద్దతుదారులు, 10 చోట్ల రెబల్స్, ఇండిపెండెట్లు గెలిచారు. వేలేరు మండలంలో 12 పంచాయతీలకు రెండు ఏకగ్రీవం కాగా.. ఆ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ మండలంలో ఒక రెబల్ మినహాయిస్తే ఐదు కాంగ్రెస్‌కు, ఆరు బీఆర్‌ఎస్‌కు సూచిస్తున్నాయి. అదే విధంగా పరకాలలో 10 సర్పంచ్‌లకు ఆరు కాంగ్రెస్ గెలుచుకోగా, నాలుగు బీఆర్‌ఎస్, ఇద్దరు ఇండిపెండెట్లు గెలిచారు. ఐనవోలులో 17 పంచాయతీలకు 9 కాంగ్రెస్, 5 బీఆర్‌ఎస్, ఒక బీజేపీ, ఇద్దరు ఇండిపెండెట్లు గెలిచారు. ఇక్కడ గట్టి కృషి జరిగినా ఫలితాలు ‘కారు’ పెరిగేవంటున్నారు. ధర్మసాగర్‌లో 19 పంచాయతీలకు 13 కాంగ్రెస్, ఐదు బీఆర్‌ఎస్, ఒకచోట కాంగ్రెస్ రెబల్ గెలుపొందగా.. ఇక్కడ మూడు చోట్ల సమీప మెజార్టీతో బీఆర్‌ఎస్ మద్దతుదారులు ఓటమి చెందారన్న చర్చ జరుగుతోంది.
గెలిచిన తిరుగుబాటు సర్పంచ్‌లను
తిరిగి ఆహ్వానిస్తున్న అధికార పార్టీ
‘రెండో’ పోరులో పలుచోట్ల
సత్తా చాటిన అభ్యర్థులు
కాంగ్రెస్ బలపర్చిన వారికి
తప్పని బెడద
చివరి వరకు మద్దతు ఆశించి..
రెబల్స్‌గా బరిలోకి దిగిన ఆశావహులు
వేలేరులో ‘కడియం’,
‘జంగా’లకు షాక్...


