ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
● జిల్లా ఎన్నికల అధికారి,
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
నర్సంపేట రూరల్: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పొరపాట్లకు తావులేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఈ మేరకు నర్సంపేట ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, జోనల్ అధికారులు, ఆర్వోలు, మండల అధికారులతో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టర్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఎన్నికల సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల ద్వారా ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, డీబీసీడీఓ పుష్పలత, డీఎస్‌సీడీఓ భాగ్యలక్ష్మి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
ఖానాపురం: స్థానిక సంస్థల ఎన్నికల విధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగే విధంగా చూసుకోవాలని చెప్పారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. పోలింగ్ సమయంలో ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీటీడీఓ సౌజన్య, తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ అద్వైత, ఎంపీఓ సునీల్‌కుమార్ ఉన్నారు.


