హస్తం జోష్.. కారు జోరు
సాక్షి, వరంగల్: జిల్లాలో ఆదివారం జరిగిన రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు మెజారిటీ విజయం సాధించారు. దుగ్గొండి, గీసుకొండ, సంగెం, నల్లబెల్లి మండలాల్లోని 116 పంచాయతీల్లో 70 మంది కాంగ్రెస్ మద్దతుదారులు గెలిస్తే.. తామేం తక్కువకాదన్నట్లు బీఆర్‌ఎస్ కూడా 40 స్థానాలు గెలుచుకొని పోటీలో నిలిచింది. బీజేపీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. సీపీఐఎంఎల్ పార్టీ ఒకచోట గెలిచింది. ముగ్గురు స్వతంత్రులు విజయబావుటా ఎగురవేశారు. తొలివిడత ఎన్నికలు జరిగిన వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లోని 91 పంచాయతీల్లో 56 స్థానాలను కాంగ్రెస్, 26 స్థానాలను బీఆర్‌ఎస్ గెలుచుకుంది.
నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో కాంగ్రెస్ 33 స్థానాల్లో నెగ్గితే.. బీఆర్‌ఎస్ 27 స్థానాలను గెలిచి అధికార పార్టీకి సవాల్ విసిరింది. అలాగే, గీసుకొండలో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినట్లుగా చెప్పుకుంటున్న 16 స్థానాల్లో కొండా వర్గం ఏడుగురు ఉండగా, ఎమ్మెల్యే రేవూరి వర్గం 9 మంది ఉన్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి నర్సంపేట వచ్చి నియోజకవర్గంపై అభివృద్ధి వరాలు కురిపించినా ఇక్కడి పంచాయతీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించినట్టు లేదు. మూడోదశ ఎన్నికలు నర్సంపేట నియోజకవర్గంలోని నర్సంపేట, ఖానాపురం, నెక్కొండ, చెన్నారావుపేట మండలాలు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కాగా, ఎస్టీ రిజర్వ్ అయిన వంజారపల్లిలో ఎస్టీ జనాభా లేకపోవడంతో సర్పంచ్‌కు నామినేషన్లు దాఖలు చేయలేదు. ఈ ఒక్కటి మినహాయిస్తే 116 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు.
ఎమ్మెల్యేకు అనుకూలం..
మంత్రికి ప్రతికూలం..
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకారెడ్డి సొంతూరు దుగ్గొండి మండలం కేశవపురంలో కాంగ్రెస్ అభ్యర్థి బదరగాని రమ 59 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈమెకు 238 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్ అభ్యర్థి వైనాల వనమ్మకు 179 ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్యే రేవూరి ఆదివారం ఉదయం వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
● నల్లబెల్లి మండలం గోవిందాపూర్‌లో నిలిచిన మంత్రి సీతక్క బావ బిడ్డ వాసం తిరుపతమ్మ (కాంగ్రెస్ అభ్యర్థి)కు భారీ ఓటమి ఎదురైంది. మంత్రి సీతక్క స్వయంగా వచ్చి గెలిపించాలని ఓటర్లను కోరినా ఆమె 225 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి పాడ్య రజితకు 490 ఓట్లు రాగా, తిరుపతమ్మకు 265 ఓట్లు వచ్చాయి. అలాగే, ఇక్కడి 8వ వార్డుల్లో 7 బీఆర్‌ఎస్ గెలుచుకుంది. 8వ వార్డులో బరిలో నిలిచిన బీఆర్‌ఎస్ అభ్యర్థి పాల్త్య సారయ్యకు, బీఆర్‌ఎస్ రెబల్ భూక్యా దేవ్‌సింగ్‌కు 37 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు టాస్ వేయడంతో భూక్యాదేవ్ సింగ్‌ను విజయం వరించింది.
మండలాల వారీగా గెలిచిన సర్పంచ్‌ల వివరాలు..
మరిన్ని ఎన్నికల వార్తలు – 8లోu రెండో విడత సర్పంచ్‌లు వీరే.. – 9లోu
సంగెం మండలం ఆశాలపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన కొంగర మల్లమ్మ ఒక ఓటు తేడాతో గెలిచారు.
దుగ్గొండి మండలం గిర్నిబావిలో కాంగ్రెస్ అభ్యర్థి పెండ్లి వెంకటేశ్వర్లు నాలుగు ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాగే, చంద్రయ్యపల్లిలో 8 ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్ అభ్యర్థి తాళ్ల మయూరి గెలిచారు.
నల్లబెల్లి మండలం ముచ్చింపులలో కాంగ్రెస్ అభ్యర్థి ఇస్తార్ శేఖర్ 6 ఓట్ల తేడాతో గెలిచారు. అర్షనపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధ సంతోష్ మూడు ఓట్ల తేడాతో గెలిచారు.
గీసుకొండ మండలం శాయంపేట హవేలిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గాలి యాకయ్య సమీప ప్రత్యర్థి నాగార్జునపై 6 ఓట్ల తేడాతో అనూహ్యంగా గెలిచారు.
సపవాట్ దేవ్‌సింగ్ గత ఎన్నికల్లో ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ప్రస్తుత గ్రామపంచాయతీ ఎన్నికల్లో నల్లబెల్లి మండలం ముడుచెక్కలపల్లి ఎస్టీ మహిళకు రిజర్వు అయ్యింది. దీంతో తన భార్య కవితను సర్పంచ్ బరిలో నిలపగా గెలుపొందింది.
మండలం పంచాయతీలు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ ఇతరులు
దుగ్గొండి 34 21 11 0 2
గీసుకొండ 21 16 3 0 2
నల్లబెల్లి 29 12 16 1 0
సంగెం 32 21 10 1 0
మొత్తం 116 70 40 2 4
హస్తం జోష్.. కారు జోరు
హస్తం జోష్.. కారు జోరు


