నాగారంలో గులాబీ రెపరెపలు
● 599 ఓట్లతో బీఆర్‌ఎస్ మద్దతు అభ్యర్థి విజయం
● 12 వార్డుల్లో 10 వార్డులు బీఆర్‌ఎస్, 2 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపు
పరకాల: నాగారం గ్రామంలో సర్పంచ్ స్థానాన్ని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. రెండు పార్టీల మండల అధ్యక్షులది ఇదే గ్రామం. వారిద్దరూ గతంలో సర్పంచ్ స్థానానికి పోటీపడ్డారు. ఈసారి బీసీ (మహిళ)కు రావడంతో వారి అనుచరులను బరిలో నిలిపారు. దీంతో ఈ గ్రామ ఫలితాలపై మండలవాసులు ఆసక్తి చూపించారు. బీఆర్‌ఎస్ మద్దతుతో బరిలో నిలిచిన ఏరుకొండ రమాదేవి, కాంగ్రెస్ అభ్యర్థిపై 599 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాగా, గ్రామంలో మొత్తం 12వార్డులు ఉండగా, 10 వార్డులను బీఆర్‌ఎస్, రెండు వార్డులను కాంగ్రెస్ గెలుచుకుంది. గ్రామంలో భారీ ఆధిక్యత రావడంతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు.
పోలింగ్ జరుగుతున్న సమయంనుంచి లెక్కింపు ప్రక్రియ జరిగే వరకు సమస్యాత్మకమైన గ్రామం నాగారంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 12 వార్డుల్లో వరుసగా బీఆర్‌ఎస్ 9 స్థానాలను గెలుచుకోగానే ఆయా వార్డు అభ్యర్థుల బంధువులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్నికల అధికారులు ఏదో మాయ చేశారని ఆరోపిస్తూ కౌంటింగ్ హాల్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు కుట్ర చేశారంటూ గొడవ చేశారు. పోలీసులు వారందరిని బస్టాండ్ వైపు వెళ్లగొట్టారు. ఈ ఘటనకు ముందు పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు గొడపడ్డారు. ఎన్నికల తర్వాత ఎవరి సంగతేంటో తేల్చుకుందామని మాటల యుద్ధానికి దిగగా సీఐ క్రాంతికుమార్ జోక్యం చేసుకొని బయటకు పంపించారు. గ్రామంలో పరిస్థితిపై అప్రమత్తమైన పోలీసులు ముందు జాగ్రత్తగా గ్రామంలో రాత్రి వరకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
నాగారంలో గులాబీ రెపరెపలు


