పోటెత్తిన ఓటర్లు..
సాక్షి, వరంగల్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగిన నల్లబెల్లి, దుగ్గొండి, గీసుకొండ, సంగెం మండలాల్లోని 1,008 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. 1,36,191 మంది ఓటర్లకు 1,20,001 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం సెలవు దినం కలిసి రావడంతో నగరాలు, పట్టణాల్లో స్థిరపడిన వలస ఓటర్లు పల్లెలకు భారీగా తరలివచ్చారు. తొలి విడత నమోదైన 86.52 శాతం కంటే ఈసారి 88.11 శాతం నమోదైంది. పోలీసుల భారీ భద్రత నడుమ 1,181 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 2,568 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ల సమక్షంలో ఉదయం ఏడు నుంచి మొదలైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగింది. కొన్నిచోట్ల మధ్యాహ్నం ఒంటిగంటలోపు క్యూలో నిల్చున్న ఓటర్లకు అవకాశం ఇవ్వడంతో మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల వరకు కొనసాగింది. ఉదయం 9 గంటల వరకు 18.82 శాతంతో మందకొడిగా ఉన్న 11 గంటల వరకు 59.31 శాతం, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 77.66 శాతం, ఆ తర్వాత క్యూలైన్లలో నిలుచొని ఓటేసిన వారితో పోలింగ్ శాతం 88.11 శాతానికి చేరుకుంది. గీసుకొండ మండలం గీసుకొండ, గంగదేవిపల్లి, దుగ్గొండి మండలం వెంకటాపూర్, దేశాయిపల్లి, నల్లబెల్లి మండలం నల్లబెల్లి ఉన్నత పాఠశాల, నందిగామ, సంగెం మండలం సంగెం ఉన్నత పాఠశాల, మొండ్రాయిలో హరిత పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటేసిన తర్వాత ఓటర్లు తమ వేలి సిరా చుక్క చూపిస్తూ హరిత పోలింగ్ కేంద్రాల్లో ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకు పోలీసు నిషేధాజ్ఞలు ఉన్నాయి. దీంతో అన్ని పార్టీల నేతలు అవతలే ఉండి తమ గుర్తుకు ఓటేయాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. యువత, పురుషులు, మహిళలు, వృద్ధులు ఓటేసేందుకు రావడంతో పల్లెల్లో సందడి వాతావరణం కనిపించింది. అయితే, కొన్నిచోట్ల ఓటరు స్లిప్పులు లేక ఇబ్బందులు ఎదురవడం మినహా అంతా ప్రశాంతంగానే సాగింది.
మహిళా ఓటర్లు ఎక్కువ..
ఓటు హక్కు వినియోగించుకుంది ఎక్కువ పురుషులే..
ఈ నాలుగు మండలాల్లో 66,427 మంది పురుషులుంటే 58,688 మంది, 69,722 మంది మహిళలుంటే 61,311 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే పురుషులు 88.30 శాతం వినియోగించుకుంటే మహిళలు కాస్త తక్కువగా 87.94 శాతం ఓటేశారు. అంటే మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నా కూడా ఓటు హక్కు వినియోగంలో పురుషులే ముందున్నారు. రెండు ఓట్లు ఉన్న ఇతరులు కూడా ఓటేశారు.
దుగ్గొండి, నల్లబెల్లి, గీసుకొండ, సంగెం మండలాల్లో ప్రశాంతంగా పోలింగ్
తొలి విడత 86.52,
రెండో విడత 88.11 శాతం నమోదు
ఓటు హక్కు వినియోగంలో మహిళల కంటే పురుషులే అధికం
పోటెత్తిన ఓటర్లు..
పోటెత్తిన ఓటర్లు..
పోటెత్తిన ఓటర్లు..


