నేటి నుంచి నామినేషన్లు
మొదటి విడతలో 91 పంచాయతీలు, 800 వార్డులు
వరంగల్/న్యూశాయంపేట: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 317 గ్రామ పంచాయతీల్లో 2,754 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా 3,83,738 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 11న మొదటి విడత, 14న రెండవ విడత, 17న మూడవ విడత ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నేడు రాష్ట్ర ఎన్నికల అధికారి రాణీకుముదిని పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగానే మొదటి విడత జరిగే గ్రామ పంచాయతీల్లో నామినేషన్లను ఈనెల 29వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఇందుకు గాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద మొదటి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరించేందుకు తగిన ఏర్పాట్లపై బుధవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 317 గ్రామ పంచాయతీల్లో 206 పంచాయతీలు సాధారణ కేటగిరి, 89 సమస్యాత్మక పంచాయతీలు, 22 అత్యంత సమస్మాత్మక పంచాయతీలుగా గుర్తించినట్లు తెలిపారు. చెన్నరావుపేట, ఖానాపురం, గీసుకొండ మండలాల్లో అత్యంత సమస్యాత్మక పంచాయతీలు ఉన్నాయన్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే 91 పంచాయతీల్లో 800 వార్డుల్లో 1,15,882 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో విడత ఎన్నికలు జరిగే 117 పంచాయతీల్లో 1,008 వార్డుల్లో 1,39,100 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మూడవ విడత ఎన్నికలు జరిగే 109 పంచాయతీల్లో 946 వార్డుల్లో 1,28,756 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొదటి విడత నామినేషన్లు నేటి (గురువారం) నుంచి ఈనెల 29వ తేదీ వరకు స్వీకరిస్తారు. 30న స్కూృటినీ, డిసెంబర్ 1న అప్పీల్, 2న అప్పీళ్లపై పరిష్కారం, డిసెంబర్ 3న మధ్యాహ్నం వరకు ఉప సంహరణ గడువు ముగియగానే పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ప్రతి ఒక్క మండలానికి ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం, ఒక సహాయ వ్యయ వివరాల అధికారి, జిల్లాలో ఒక సర్వేలెన్స్ బృందం ఎన్నికల ప్రవర్తనా నియామళిని పర్యవేక్షిస్తారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణిలు పాల్గొన్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు..
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీకుముదినీ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల నిర్వహణపై పోలీసు కమిషనర్లు, కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ సజావుగా నిర్వహించాలని, నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలన్నారు.
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి
ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జీపీ, వార్డు స్థానాల ఎన్నికల నిర్వహణపై ఆర్డీఓలు, ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారులు, ఏఆర్‌ఓలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. నోటిఫికేషన్ విడుదలైనందున జిల్లాలోని 11మండలాల పరిధిలోని 317 జీపీ సర్పంచ్‌లు, 2,754వార్డు సభ్యుల ఎన్నికలకు మూడు విడతల్లో ఎన్నికలు ఉంటాయన్నారు. నామినేషన్ పత్రాల స్వీకరణ నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎన్నికల సహాయ కేంద్రం ఏర్పాటు
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కలెక్టరేట్‌లో ఎన్నికల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద తెలిపారు. ప్రజలకు ఏమైనా అసౌకర్యం కలిగితే టోల్‌ఫ్రీ నంబర్లు 1800 4253 424, 91542 52936, 0870 2530812లకు కాల్ చేసి సహాయం పొందవచ్చన్నారు.
క్లస్టర్ల వారీగా నామినేషన్ల స్వీకరణ
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద
నేటి నుంచి నామినేషన్లు
నేటి నుంచి నామినేషన్లు


