వైజ్ఞానిక పండుగకు వేళాయె
కాళోజీ సెంటర్/ఖిలా వరంగల్: విద్యార్థుల్లో నూతన ఆలోచనలను ప్రోత్సహించేలా జిల్లా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు వైజ్ఞానిక, ఇన్‌స్పైర్ అవార్డ్స్ ప్రాజెక్ట్‌ల ప్రదర్శన నిర్వహిస్తోంది. జిల్లా స్థాయి ప్రదర్శనకు ఉర్సుగుట్ట సమీపంలోని తాళ్ల పద్మావతి స్కూల్ వేదికై ంది. బుధవారం డీఈఓ రంగయ్యనాయుడు, జిల్లా సైన్స్ అధికారి కట్ల శ్రీనివాస్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ), బాల వైజ్ఞానిక ప్రదర్శన (ఆర్‌ఎస్‌బీవీపీ) సంయుక్త ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తుందన్నారు. ఈ ప్రదర్శనలో ఎంపిక చేసిన 164 ప్రాజెక్టుల విద్యార్థులు పాల్గొననున్నారు. ఈ ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులు బాల వైజ్ఞానిక ప్రదర్శనలో ఒక ఎగ్జిబిట్‌కు ఒక విద్యార్థికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఒక పాఠశాల నుంచి ఒక సబ్ థీమ్‌లో ఒకటికంటే ఎక్కువ ఎగ్జిబిట్లు అనుమతి లేదన్నారు. అలాగే 27న స్పాట్ రిజిస్ట్రేషన్స్‌కు అనుమతి లేదన్నారు. ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌లో పాల్గొనే విద్యార్థులు నిర్ణీత ఫార్మాట్‌లో వారి ఎగ్జిబిట్స్ లేదా ప్రాజెక్టు నివేదికను సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఉత్తమ ఎగ్జిబిట్లను రాష్ట్రస్థాయికి, బాల వైజ్ఞానిక ప్రదర్శనలో జూనియర్, సీనియర్ కేటగిరీలో సబ్ థీమ్ వారీగా 14 ఎగ్జిబిట్లను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయబడతాయన్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, సామాన్య ప్రజలు వీక్షించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో 27న వరంగల్, ఖిలావరంగల్, గీసుకొండ మండలాలు, 28న ఖానాపురం, నెక్కొండ, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట, 29న వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాల విద్యార్థులు సందర్శించవచ్చు.
భాగస్వాములవ్వాలి..
విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని ప్రతిభ చాటాలని డీఈఓ రంగయ్యనాయుడు వెల్లడించారు. నిర్ధేశించిన అంశాల్లో విద్యార్థులు తమ ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి బడి నుంచి వైజ్ఞానిక మేళాలో విద్యార్థులు పాల్గొనేలా ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలని సూచించారు. ప్రదర్శనలో వినూత్న అంశాలకు చోటు కల్పించాలని సైన్స్ జిల్లా అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్, డీసీఈబీ సెక్రటరీ కృష్ణమూర్తి కోరారు.
నేటి నుంచి వైజ్ఞానిక, ఇన్‌స్పైర్ మనక్ ఎగ్జిబిషన్
వైజ్ఞానిక పండుగకు వేళాయె


