కలెక్టరేట్‌లో రాజ్యాంగ దినోత్సవం
న్యూశాయంపేట: దేశంలో అందరికీ సమాన అవకాశాలు దక్కుతున్నాయంటే అది భారత రాజ్యాంగం కల్పించిన గొప్పతనమేనని కలెక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. అధికారులు సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లోని రాజ్యాంగానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త బీఆర్ అంబేడ్కర్ సేవలను స్మరించుకుంటూ విలువలు, పౌర హక్కులు, కర్తవ్యాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి కట్టుబడి పనిచేయాలన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
చిన్ననాటి పాఠశాలలో ఇస్రో రిటైర్డ్ శాస్త్రవేత్త
దుగ్గొండి: చిన్ననాటి పాఠశాలను సందర్శించి తన అభిమానాన్ని చాటుకున్నారు ఇస్రో రిటైర్డ్ శాస్త్రవేత్త విజయజ్యోతి. మండలంలోని నాచినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి చదువుకుంది. అనంతరం ఉన్నత చదువుల కోసం ఇతర పట్టణాల్లో చదివి ఇస్రో శాస్త్రవేత్తగా స్థిరపడింది. ఇటీవల విజయజ్యోతి పదవీ విరమణ పొందడంతో మొదట చిన్ననాటి పాఠశాలను సందర్శించాలని నిర్ణయించుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం పాఠశాలను సందర్శించింది. పాఠశాలలోని గదులను పరిశీలించి నాటి గుర్తులకు నెమరు వేసుకుంది. విద్యార్థులకు విశ్వరహస్యాలు, ఉప గ్రహాలు, చంద్రాయన్ తదితర అంశాలను వివరించింది. అనంతరం విజయజ్యోతి దంపతులను ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్, శ్రీనివాస్, సుమలత, మాధవరావు, కమల, ప్రదీప్, రాధిక పాల్గొన్నారు.
వినాశకర విధానాలు వీడకపోతే ప్రతిఘటనే
న్యూశాయంపేట: కేంద్రం వినాశకర విధానాలు వీడకపోతే ప్రతిఘటన తప్పదని కేంద్ర ప్రభుత్వ విధానాలతో అసమానతలు పెరుగుతున్నాయని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) రాష్ట్ర కన్వీనర్ పెద్దారపు రమేశ్ అన్నారు. బుధవారం రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో హనుమకొండ ఏకశిల పార్కు నుంచి వరంగల్ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈసందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లా కన్వీనర్ కె.బాబురావు అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో నాయకులు మాధవి, ముక్కెర రామస్వామి, ఎలకంటి రాజేందర్, బాబు, రాచర్ల బాలరాజు, శ్రీనివాస్, మొగిళి, కుమారస్వామి, ప్రతాప్, కుమార్, బషీర్, సాయిలు, రాజన్న, వీరయ్య, మోహన్‌రావు, ఇస్మాయిల్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో రాజ్యాంగ దినోత్సవం
కలెక్టరేట్‌లో రాజ్యాంగ దినోత్సవం


