వరద బాధిత రైతులకు పరిహారం అందిస్తాం
పరకాల: భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కోరారు. పరకాల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటుచేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారయణరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. సీసీఐ వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ భారీ వర్షాలతో నష్టపోయిన పంటలను సర్వే చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద పత్తిని విక్రయించి రైతులు మద్దతు ధర పొందాలని కోరారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సీసీఐ అధికారులు రైతులు తీసుకొచ్చే పత్తి 8నుంచి 12శాతం వరకు తేమశాతం ఉండాలనే నిబంధనలను సడలించి 20శాతం తేమ ఉన్నా కొనేందుకు చొరవ తీసుకోవాలన్నారు. అప్పుడే రైతుకు నష్టం జరగకుండా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, తహసీల్దార్ విజయలక్ష్మి, మార్కెట్ అధికారులు, అడ్తిదారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, రైతులు పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి


