తడిసిన ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు
● జిల్లా వ్యవసాయాధికారి
కూనమల్ల అనురాధ
రాయపర్తి: తడిసి రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి కూనమల్ల అనురాధ తెలిపారు. మండలంలోని గట్టికల్, మైలారం, ఊకల్, కొండాపురం, రాయపర్తి గ్రామాల్లో తుపాను ధాటికి దెబ్బతిన్న పంటలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు తమ పొలాల్లో నీటి నిల్వలు లేకుండా పాయలు చేసి నీటిని బయటకు పంపించాలని సూచించారు. నేలవాలిన వరిని కట్టలుగా కట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి గుమ్మడి వీరభద్రం, ఏఈఓలు సాయి, మనస్విని, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
పంటనష్టం సర్వే తనిఖీ
వర్ధన్నపేట: మోంథా తుపాను ప్రభావంతో మండలంలో జరిగిన పంటనష్టం వివరాల సేకరణపై వ్యవసాయ అధికారులు చేస్తున్న సర్వేను జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుపాను కారణంగా మండలంలో ప్రధానంగా కోతకు వచ్చిన వరి పంట నేలమట్టమైందన్నారు. పంట నష్టాన్ని యాప్ ద్వారా వ్యవసాయ విస్తరణ అధికారులు సర్వే చేస్తున్నారని తెలిపారు. తద్వారా రైతులకు నష్టపరిహారం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి విజయ్, వ్యవసాయ విస్తరణ అధికారి మౌనిక, రైతులు పాల్గొన్నారు.


