నాసిరకం విత్తనాలతో మోసపోయాం
● న్యాయం చేయాలని
అన్నదాతల నిరసన
వర్ధన్నపేట: నాసిరకం వరి విత్తనాలతో మోసపోయామని అన్నదాతలు ఆందోళనకు దిగిన సంఘటన వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండాలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుమారు పది మంది రైతులు వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ షాపులో విత్తనాలు కొనుగోలు చేశారు. పంట కోసే సమయానికి దిగుబడి రాకపోవడంతో అన్నదాతలు ఆందోళన బాటపట్టారు. గింజ పరిమాణం తక్కువగా ఉండి తాలు శాతం ఎక్కువగా ఉన్న విత్తనాల కారణంగా తాము నష్టపోయామని సదరు ఫర్టిలైజర్ యజమానితో వాగ్వాదానికి దిగారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందని నమ్మించి నాసిరకం విత్తనాలను తమకు అంటగట్టి దుకాణ నిర్వాహకులు నిండా ముంచారని వాపోయారు. నకిలీ విత్తనాలతో మోసపోయిన తమకు న్యాయం చేయాలని, నకిలీ విత్తనాలు విక్రయించిన ఫర్టిలైజర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.


