రైతులు ఆందోళన చెందొద్దు
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట/నెక్కొండ/నర్సంపేట రూరల్: నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ, చెన్నారావుపేట, నర్సంపేట మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గురువారం పర్యటించారు. బుధవారం కురిసిన వర్షంతో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పంటలు, ఆస్తి నష్టం జరగడంతో బాధితులను కలిసి భరోసా కల్పించారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్డీఓ ఉమారాణితో కలిసి, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో గురువారం వేర్వేరుగా మాట్లాడారు. పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో వరంగల్–నర్సంపేట రహదారిని నాలుగు వరుసల రోడ్డుగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. నర్సంపేట–నెక్కొండ, నెక్కొండ–కేసముద్రం, నర్సంపేట–గూడూరు రోడ్డులను 10 మీటర్ల వెడల్పుతో మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీఓ లావణ్య, ఎస్సై మహేందర్, ఎంపీఓ దయాకర్, పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, లావుడ్యా తిరుమల్, ఆవుల శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


