పంట నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు పాటించాలి
● వీసీలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
న్యూశాయంపేట: వర్షాలతో పంటకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. పత్తి, ధాన్యం, మొక్కజొన్న వంటి పంటల కొనుగోలుపై హైదరాబాద్ నుంచి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సోమవారం సాయంత్రం సమీక్షించారు. రాబోయే రెండు రోజులు తుపాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెండు రోజుల పాటు పంట కోతలు వాయిదా వేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జిల్లా అధికారులు అలర్ట్‌గా ఉండాలన్నారు. డీసీఎస్‌ఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి హెల్ప్‌లైన్ నంబర్‌ను 79950 50785 అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వీసీలో జిల్లా అధికారులు రాంరెడ్డి, అనురాధ, నీరజ, కిష్టయ్య, సంధ్యారాణి, సురేఖ, తదితరులు పాల్గొన్నారు.


