కుటుంబాలతో కలిసి ధర్నా చేస్తాం
న్యూశాయంపేట: రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోతే కుటుంబాలతో కలిసి వచ్చి ధర్నా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వీరయ్య హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 18 నెలలుగా ప్రభుత్వం పింఛన్ తప్ప ఎలాంటి ప్రయోజనాలు అందజేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో విసిగివేసారి నిరసనకు పూనుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర అసోసియేట్ ఉపాధ్యక్షుడు సుధీర్‌బాబు మాట్లాడుతూ బకాయిలు అందకపోవడంతో మానసిక క్షోభకు గురై ఇప్పటివరకు 20 మంది రిటైర్డ్ ఉద్యోగులు అసువులు బాసారని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నా కార్యక్రమంలో బకాయిల సాధన కమిటీ నాయకులు శ్రీధర ధర్మేద్ర, కడారి భోగేశ్వర్, మహబూబ్ అలీ, గఫార్, బాబురావు, సదానందం, వేణుమాధవ్, కృష్ణమూర్తి, కృష్ణకుమార్, సారంగపాణి, సమ్మయ్య, కుమారస్వామి, దామోదర్, చలం, సారయ్య, వనజ, రమాదేవి పాల్గొన్నారు.
108, 102 వాహనాల తనిఖీ
సంగెం: మండల కేంద్రంలోని 108, 102 వాహనాలను జిల్లా మేనేజర్ గుర్రపు భరత్‌కుమార్ సోమవారం తనిఖీ చేశారు. వాహనంలో ఉన్న పరికరాలు, రిజిస్టర్లు, మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి తగు సలహాలు, సూచనలు చేశారు. కాల్ సెంటర్ నుంచి కేసు వచ్చిన వెంటనే సంఘటన స్థలానికి సకాలంలో చేరుకుని క్షతగాత్రులు, బాధితులకు ప్రథమ చికిత్స అందిస్తూ ఆస్పత్రికి తరలించాలన్నారు. విధుల పట్ల సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండల కేంద్రంలో 102 వాహన సేవలను గర్భిణులు వినియోగించుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో 108 సిబ్బంది మాధవరెడ్డి, రాజ్‌కుమార్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఆర్డీఎఫ్ విద్యార్థిని
పర్వతగిరి: కల్లెడ ఆర్డీఎఫ్ వనిత అచ్యుత పాయి జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి గుగులోతు వెన్నెల.. జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆడెపు జనార్దన్ తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అసాధారణ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు అర్హత సాధించినట్లు జనార్దన్ వివరించారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురానికి చెందిన వెన్నెలను ప్రిన్సిపాల్‌తో పాటు వైస్ ప్రిన్సిపాల్ ఎ.రాజు, అకడమిక్ హెడ్ ప్రవీణ్‌కుమార్, ఏఓ సతీష్, పీఈటీ కోకిల, అధ్యాపకులు సంతోష్, శ్రీధర్, మహేశ్వర్, జయశంకర్, ధన్య, సైదులు గుంశావలి, శ్రీలత, ధనలక్ష్మి, తిరుమల అభినందించారు.
కుటుంబాలతో కలిసి ధర్నా చేస్తాం
కుటుంబాలతో కలిసి ధర్నా చేస్తాం


