వేటుతో సరి.. పర్యవేక్షణ లేదు మరి! | - | Sakshi
Sakshi News home page

వేటుతో సరి.. పర్యవేక్షణ లేదు మరి!

Oct 28 2025 7:19 AM | Updated on Oct 28 2025 7:19 AM

వేటుతో సరి.. పర్యవేక్షణ లేదు మరి!

వేటుతో సరి.. పర్యవేక్షణ లేదు మరి!

వేటుతో సరి.. పర్యవేక్షణ లేదు మరి!

ఎంజీఎం : వరుస ఘటనలతో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి వార్తల్లోకెక్కుతోంది. ఏదో ఒక ఘటన జరగడం.. పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం.. ఈ విషయాన్ని సద్దుమణిగించేందుకు ప్రభుత్వ పెద్దలతోపాటు అధికారులు సూపరింటెండెంట్‌పై వేటు అని ఓ సందేశాన్ని పంపి అసలు అంశాన్ని పక్కదారి పట్టించడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి శనివారం ఒకే ఆక్సిజన్‌ సిలిండర్‌పై ఇద్దరు చిన్నారులను ఎలాంటి వైద్యసిబ్బంది సహాయం లేకుండా తీసుకెళ్లిన ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సూపరింటెండెంట్‌పై వేటు వేయాలని హెల్త్‌ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతో ఆస్పత్రి పాలన మెరుగుపడేనా అంటే సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సేవల మెరుగుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని పట్టించుకోని పెద్దలు తూతూమంత్రంగా ఒక పత్రిక ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.

హైదరాబాద్‌ టు వరంగల్‌..

ఆస్పత్రి పాలనలో సూపరింటెండెంట్‌తోపాటు ఆర్‌ఎంఓలు, ఆయా విభాగాధిపతులు కీలకం. వీరు వరంగల్‌లోనే నివాసం ఉంటూ ఆస్పత్రిలో ఆయా విభాగాల వారీగా ఎప్పటికప్పుడు సేవలందిస్తూ సమస్యలను సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకెళ్లాలి. కావాల్సిన ఔషధాలు, పరికరాలను సమకూర్చుకుంటూ రోగులకు మెరుగైన సేవలందించాలి. కానీ వీరిలో చాలామంది హైదరాబాద్‌ నుంచి ఓరుగల్లుకు అప్‌అండ్‌డౌన్‌ చేస్తున్నారు. సమయపాలన పాటించకుండా వచ్చి వెళ్తున్నవారిపై చర్యలు తీసుకోకుండా సూపరింటెండెంట్‌పై వేటు వేస్తే ఆస్పత్రి ఎలా బాగుపడుతుందన్న చర్చ జరుగుతోంది.

కుప్పకూలుతున్న పిల్లల విభాగం..

ఎంజీఎం ఆస్పత్రి పిల్లల విభాగం అంటే మంచి వైద్యం అందుతుందన్న అభిప్రాయం గతంలో ఉండేది. సాధారణ బదిలీల తరువాత హైదరాబాద్‌ నుంచి బదిలీపై వచ్చిన వైద్యులు సరిగ్గా విధులకు రాకపోవడంతో ఈ విభాగం అధ్వానంగా మారిందన్న ఆరోపణలున్నాయి. గత శనివారం పిల్లల విభాగాధిపతి విధులకు రాకపోవడంతోనే ఘటనకు కారణమనే విషయాన్ని గ్రహించిన సూపరింటెండెంట్‌ ఆమెకు మెమో సైతం జారీ చేశారు.

ఏళ్ల తరబడిగా భర్తీకి నోచని ఆర్‌ఎంఓ పోస్టులు

1,500 పడకల ఎంజీఎం ఆస్పత్రిలో అన్ని విభాగాల సమన్వయం చేసుకునేందుకు పరిపాలన విభాగంలో సూపరింటెండెంట్‌కు తోడుగా ఓ డిప్యూటీ సూపరింటెండెంట్‌ పోస్టుతోపాటు ముగ్గురు ఆర్‌ఎంఓ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. కొన్నేళ్లుగా సివిల్‌, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ పోస్టులు ఖాళీగా ఉండగా, రెండు నెలల క్రితం డిప్యూటీ సివిల్‌ సర్జన్‌గా విధుల్లో చేరిన వైద్యుడే వారానికి రెండు రోజులు ఆస్పత్రికి వస్తున్నారని, వైద్యసిబ్బంది పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. ఇక.. ఆస్పత్రికి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో కాంట్రాక్టర్‌లకు ఇవ్వాల్సిన బకాయిలు పేరుకుపోవడం వల్ల కనీసం మందులు సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. హెచ్‌డీఎస్‌ నిధులనుంచి స్టేషనరీ కొనుగోలు చేస్తున్నారు.

పట్టించుకోని మంత్రులు, ప్రజాప్రతినిధులు

ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో సేవలపై స్థానిక మంత్రి సురేఖతోపాటు ఎమ్మెల్యేలు సైతం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని.. రెండు, మూడు సార్లు సందర్శించి విధులకు హాజరుకాని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసినా ఎలాంటి మార్పు లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు తక్షణమే ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి పాలనపై దృష్టి పెడితే తప్ప ఆస్పత్రి గాడిన పడే పరిస్థితి లేదన్న టాక్‌ వినిపిస్తోంది.

ఎంజీఎంలో వరుస ఘటనలతో కలకలం

సూపరింటెండెంట్‌పై వేటు వేస్తే..

ఆస్పత్రి గాడిన పడుతుందా..?

ఆస్పత్రిపై కరువైన ప్రజాప్రతినిధుల దృష్టి

ఓవైపు నిధుల కొరత..

మరోవైపు పరికరాల లేమి

హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు

వైద్యుల రాకపోకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement