
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● వైద్య, ఆరోగ్యశాఖ సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపు హాల్‌లో వైద్య, ఆరోగ్యశాఖ, ప్రోగ్రాం అధికారులు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యసేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాల లభ్యత, వైద్యుల హజరు, పరీక్ష పరికరాల వినియోగం, మాతాశిశు సంరక్షణ వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా నాన్ కమ్యూనికేబుల్ డిసీసెస్ సర్వే నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, సిజేరియన్లు కాకుండా గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు. ప్రైవేట్ డాక్టర్లు విధిగా సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలన్నారు. సీజనల్ వ్యాధులు మలేరియా, పైలేరియా డెంగీ, చికున్‌గున్యా, మెదడువాపు వ్యాధులను చికిత్స అందించాలని కోరారు. వ్యాధి గ్రస్తుల సమీపంలో ఉన్న వారిని స్క్రీనింగ్ చేసి వ్యాధులు ప్రబలకుండా చూడాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ బి. సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు ప్రకాశ్, కొంరయ్య, ప్రోగాం అధికారులు రవీందర్, ఆచార్య, విజయ్‌కుమార్, మోహన్‌సింగ్, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.