
ఉర్సు రంగలీల మైదానంలో నరకాసుర వధ
ఖిలా వరంగల్: వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో ఆదివారం సాయంత్రం నరకాసుర వధ కనులపండువగా జరిగింది. కృష్ణుడు, సత్యభామతో కలిసి నరకాసురుడిని బాణసంచాతో సంహరించిన వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉత్సవ కమిటీ, జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసింది. మైదాన పరిసరాల్లోకి వాహనాలు రాకుండా కిలోమీటర్ల దూరంలోనే నలువైపులా ప్రత్యేక పార్కింగ్ వసతి అందుబాటులోకి తెచ్చారు.
ప్రధాన ఘట్టంగా రథయాత్ర..
ఉర్సు ప్రతాప్‌నగర్ నుంచి ప్రత్యేక రథంపై కృష్ణుడు, సత్యభామ ఉత్సవ మూర్తులతోపాటు యువతులు ధనస్సు చేతబట్టి శ్రీకష్ణుడు, సత్యభామ వేషధారణతో వచ్చారు. కళాకారుల నృత్యాలు, డప్పుచప్పుళ్లు, భజనల నడుమ వారు రంగలీల మైదానానికి చేరుకున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మరుపల్ల రవి, సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 58 అడుగుల నరకాసుర ప్రతిమను మేయర్ గుండు సుధారాణి స్విచ్ ఆన్‌చేసి ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ పరికరంతో దహనం చేశారు.
సాంస్కృతిక ప్రదర్శనలు..
ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన కృష్ణుడు, సత్యభామ నాటకం, నృత్యాలు, పేరిణ, శివతాండం, కూచిపూడి నృత్యాలు విశేషంగా అలరించాయి. జానపద గేయాలు, తెలంగాణ ఆటపాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
భారీ బందోబస్తు..
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్‌సింగ్ ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, ఏఎస్పీ శుభంప్రకాశ్ పర్యవేక్షణలో మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేశ్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుజాత, ఎస్సైలు, 100 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు పర్యవేక్షించారు.
58 అడుగుల ప్రతిమను
దహనం చేసిన మేయర్ సుధారాణి
బాణసంచా మోతతో
దద్దరిల్లిన ప్రాంగణం
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ఉర్సు రంగలీల మైదానంలో నరకాసుర వధ