
పశువులకు టీకాలు వేయించాలి
దుగ్గొండి: పాడిరైతులు, పశుపోషకులు, జీవాలకాపరులు తప్పనిసరిగా పశువులు, జీవాలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి బాలకృష్ణ సూచించారు. మండలంలోని నాచినపల్లి, శివాజీనగర్, స్వామిరావుపల్లి గ్రామాల్లో పశువుల టీకాల శిబిరాన్ని శనివారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాలు గ్రామాల్లో నవంబర్ 15 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. టీకా వేసిన ప్రతి పశువుకు ట్యాగ్ వేయాలని, రెండు నెలలకు మొదటి టీకా, నెల తర్వాత బూస్టర్ డోస్, తర్వాత ప్రతి సంవత్సరం ఒకసారి తప్పనిసరిగా టీకా వేయించాలని కోరారు. పశువైద్యాధికారులు సోమశేఖర్, శారద, బాలాజీ, గోపాలమిత్రలు, రైతులు పాల్గొన్నారు.