
అసైన్డ్ ల్యాండ్ స్వాఽధీనం
దామెరలో 17.09,
ముస్త్యాలపల్లిలో 4.06 ఎకరాలు
దామెర: భూమిలేని నిరుపేదలకు వ్యవసాయం చేసుకుని జీవనోపాధి పొందేందుకు అసైన్డ్ చట్టం ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితం భూమిని కేటాయించారు. కాగా, అసైన్డ్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ సదరు రైతులు ఇతరులకు అమ్మారు. దీంతో అధికారులు తిరిగి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దామెర మండలకేంద్రంలోని సర్వేనంబర్ 362లోని 17. 09 ఎకరాలు, ముస్త్యాలపల్లిలోని సర్వేనంబర్ 224, 255లోని 4.06 ఎకరాలు మొత్తం 21.15 ఎకరాల అసైన్డ్ భూమిని కొంతమంది పట్టాలు చేయించుకున్నారు. ఈ వ్యవహారం ఇటీవల వెలుగులోకి రావడంలో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. అసైన్డ్ చట్టాన్ని ఉల్లంఘించి భూములు కొనుగోలు చేసి పట్టాలు చేయించుకున్నట్లు రుజువు కావడంతో ఆ పట్టాలు రద్దుచేసి భూమిని స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఆయా ఉత్తర్వులను అధికారులు దామెర, ముస్త్యాలపల్లి జీపీల్లో శనివారం ప్రదర్శించారు. ఈ విషయమై తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవిని వివరణ కోరగా అసైన్డ్ చట్టాన్ని అతిక్రమించి పట్టాలు చేయించుకున్న వారి పట్టాలు రద్దుచేసినట్లు తెలిపారు. కాగా, కోట్ల రూపాయలు విలువచేసే భూమిని రక్షించిన రెవెన్యూ అధికారులను పలువురు అభినందిస్తున్నారు.