
ఎయిర్‌పోర్ట్‌తో పారిశ్రామికాభివృద్ధి
న్యూశాయంపేట: వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం అనేది ప్రజల ఆక్షాంక్ష అని, హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా పేర్కొంటున్న వరంగల్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు మామునూరు ఎయిర్‌పోర్ట్ ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఎయిర్‌పోర్ట్ భూసేకరణ పనుల పురోగతిపై ల్యాండ్ అక్విజేషన్ రిటైర్డ్ ఓఎస్టీ మనోహర్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎయిర్‌పోర్ట్ మేనేజర్ తులసి మహాలక్ష్మి, లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మామునూరు ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు 220 ఎకరాల వ్యవసాయ భూమి సేకరణకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిందని అన్నారు. ఎయిర్‌పోర్ట్ స్థలంలోని చెరువులు కుంటలు, విద్యుత్ హైపోల్స్, సెల్‌టవర్లు, ఎత్తుగా ఉన్న భవనాలు, చెట్లను గుర్తించి నివేదికలు అందజేయాలని సంబంధిత అధికారులను సత్యశారద ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో, వరంగల్ ఇన్‌చార్జ్ ఆర్డీఓ విజయలక్ష్మి, ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, ఆర్డీఓ కార్యాలయ డీఏఏ ఫణికుమార్, ఎస్‌ఈ ఇరిగేషన్ వరంగల్ హెచ్‌వీ.రాంప్రసాద్, మిషన్ భగీరథ డీఈ జీవన్, ఎన్పీడీసీఎల్ ఏడీఈ చంద్రమౌళి, లీగల్ మెట్రాలజీ శ్రీనివాస్‌రావు, డీఎఫ్‌ఓ సృజనకుమారి, సర్వేయర్ రజిత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి
ఖానాపురం: విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. మండలంలోని అశోక్‌నగర్ కేజీబీవీని శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ పరిసరాలు, తరగతి గదులు, భవనాలు, స్టోర్ రూం, వంటగది, కూరగాయల నాణ్యత, మధ్యాహ్న భోజనం, అభివృద్ధి పనులను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను తెరిచి పరిశీలించారు. ప్రిన్సిపాల్ మేనకపై అనేక ఫిర్యాదులు రావడంతో ఆమెను కలెక్టర్ మందలించారు. భవనంపై నిరుపయోగంగా ఉన్న బెంచీలను ఇతర పాఠశాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని ఉపాధ్యాయులకు చెప్పారు. వారిని ప్రత్యేక ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో జీఈసీఓ ఫ్లోరెన్స్, తహసీల్దార్ రమేష్, టీఈడబ్ల్యూఐడీసీ డీఈ అశోక్, ఎంఈఓ శ్రీదేవి, ఎస్‌ఓ మేనక పాల్గొన్నారు.
ఎంఈఓపై విచారణకు ఆదేశం
మండల విద్యాశాఖ అధికారి శ్రీదేవిపై విచారణకు కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. మండలంలో ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు, ఉత్తమ ఉపాధ్యాయ ఎంపికలో అవకతవకలు జరిగాయని పలువురు పత్రికా విలేకరులు.. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఎంఈఓపై విచారణ చేసి నివేదిక అందించాలని జీఈసీఓ ఫ్లోరెన్స్‌ను ఆదేశించారు.