
నేడు విద్యుత్ సర్కిల్ ఎస్‌ఈతో ఫోన్ ఇన్
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాలో భాగంగా సమస్యలు, సలహాలు తెలుసుకునేందుకు ఈనెల 17న ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ ఎస్‌ఈ కె.గౌతంరెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు నిర్వహించే ఈకార్యక్రమంలో జిల్లా వినియోగదారులు 87124 84818 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలపాలని, సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
జూనియర్ కాలేజీల
సిబ్బందికి యూనిక్ ఐడీ
కాళోజీ సెంటర్: జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల సిబ్బంది సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబర్ల ఫిజికల్ వెరిఫికేషన్ గురువారం పూర్తయ్యిందని డీఐఈఓ డాక్టర్ శ్రీధర్‌సుమన్ తెలిపారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది ఇంటర్ విద్యాశాఖ కార్యాలయంలో స్వయంగా పరిశీలించిన తర్వాతే ధ్రువీకరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వివరాలు సరిగా లేకుండా తిరిగి కళాశాలకు పంపిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్ బోర్డు తీసుకొచ్చిన నూతన సంస్కరణల్లో భాగంగా సిబ్బందికి శాశ్వత యూనిక్ ఐడీ కేటాయిస్తున్నారని వివరించారు. యూనిక్ ఐడీ ద్వారా సిబ్బంది విద్యార్హతలు, అపాయింట్ మెంట్ తేదీలు, ఆధార్, బ్యాంకు ఖాతా తదితర అన్ని వివరాలు సత్వరమే పొందవచ్చని తెలిపారు.
ఖాళీ బిందెలతో
మహిళల నిరసన
వర్ధన్నపేట: తాగునీరు రావడంలేదని గురువారం సాయంత్రం ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. వర్ధన్నపేట పట్టణంలోని ఒకటో వార్డులో ఒక బోరు బావి, నల్లా కనెక్షన్లు ఉన్నాయి. కాగా, బోరు బావి మోటారును మున్సిపల్ సిబ్బంది మరమ్మతులకు తీసుకెళ్లారు. దీంతో నీటి సరఫరా నిలిచి పోయింది. వారం రోజులుగా మున్సిపల్ సిబ్బంది, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మహిళలు పేర్కొన్నారు. ఈ మేరకు ఖాళీ బిందెలతో నిరసన తెలిపినట్లు చెప్పారు. మోటారుకు మరమ్మతు పూర్తిచేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని మహిళలు డిమాండ్ చేశారు.
దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: జిల్లా పరిధిలోని మైనారిటీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సనా సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వాహకుడు మహ్మద్ హుస్సేన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. హనుమకొండ కేయు క్రాస్‌రోడ్డులోని (వరంగల్ జీ1), బాలికల గురుకులంలో జేఎల్ ఫిజిక్స్ (1), జేఎల్ కెమిస్ట్రీ (1), వరంగల్ శంభునిపేట దూపకుంటరోడ్డులోని (వరంగల్, జీ2) బాలికల గురుకులంలో జేఎల్ తెలుగు (1) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఈనెల 21లోగా హనుమకొండ నయీంనగర్ పాత ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉన్న సనా ఏజెన్సీ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 0870–3558 539 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
పేకాట శిబిరంపై దాడి
నర్సంపేట రూరల్: పేకాడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు చెన్నారావుపేట ఎస్సై రాజేశ్‌రెడ్డి తెలిపారు. పక్కా సమాచారం మేరకు గురువారం పాపయ్యపేట గ్రామంలో పేకాట శిబిరంపై దాడులు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామానికి చెందిన మురహరి రవి, కాట ప్రశాంత్, కొత్తపల్లి కృష్ణ, పరకాల సతీశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రూ. 2వేల నగదు, మూడు సెల్‌ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. దాడుల్లో ఏఎస్సై లక్ష్మణమూర్తి, పోలీస్ సిబ్బంది సతీశ్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఓటరు గుర్తింపుకార్డులు అందించాలి
న్యూశాయంపేట: తపాలా శాఖ ద్వారా నూతన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను అందించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్ అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి అధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్‌స్థాయి అధికారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డీఆర్వో విజయలక్ష్మి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్లు పాల్గొన్నారు.