
పరువు నష్టం దావా నోటీసులు
కమలాపూర్: మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి పరువు నష్టం దావా నోటీసులు జారీ చేసినట్లు బీజేపీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది బండి కళాధర్ తెలిపారు. కమలాపూర్‌లోని ఈటల నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈటల రాజేందర్, ఆయన కుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో రాతలు రాసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పీఏ భోగం అజయ్, కమలాపూర్‌కు చెందిన మాట్ల రాజ్‌కుమార్, ఇల్లందకుంట మండలం సిరిసేడుకు చెందిన జవ్వాజి కుమారస్వామి, ఇల్లందకుంటకు చెందిన దాంసాని కుమార్, జమ్మికుంటకు చెందిన పొంగంటి సంపత్, వీణవంక మండలం ఎలుబాకకు చెందిన ఎడ్ల రాకేశ్, వీణవంకకు చెందిన తాళ్లపెల్లి మహేశ్‌గౌడ్‌పై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో పాటు ఒక్కొక్కరిపై రూ.2 కోట్లకు పరువు నష్టం దావా వేసేందుకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇక నుంచి ఈటల రాజేందర్‌పై అసత్యపు ఆరోపణలు చేసినా, కించపర్చేలా మాట్లాడినా, దూషించినా సహించేది లేదని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.