
ఆలస్యం.. జలచరాలకు విషం!
సాక్షి, వరంగల్: నగరంలో నిమజ్జన తంతు ముగిసింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇతర రసాయనాలతో చేసిన గణపతి ప్రతిమలతో చెరువుల్లో వేల టన్నుల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. ఫలితంగా చెరువులు కాలుష్యానికి కేంద్రాలవుతున్నాయి. ఈ ఘనవ్యర్థాలను రోజుల వ్యవధిలో తీయాల్సిన బల్దియా, నీటి పారుదల శాఖ అధికారులు ఆలసత్వం వహిస్తున్నారు. పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీళ్లలో కలిసిపోవడంతో ఆయా చెరువులు మరింత కలుషితమవుతున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా జలచరాలతో పాటు భూగర్భజల మట్టం హానికరంగా మారనుంది. ఆ నీటిని సాగుకు ఉపయోగిస్తే పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. గతేడాది నిమజ్జనం చేసిన గణేశ్ విగ్రహాలకు ఉండే ఇనుము, కలప చిన్న వడ్డేపల్లి చెరువులో కనిపించింది. చెరువుల పరిరక్షణ సొసైటీ సభ్యులు ఇటీవల బల్దియా అధికారులతో వాగ్వాదానికి దిగడంతో వాటిని తొలగించారు.
బతుకమ్మ పండుగ తర్వాత?
బతుకమ్మ పండుగ సమయంలో చెరువుల్లో పూలను వేస్తారు. వాటితో పాటుగానే నిమజ్జన వ్యర్థాలను నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి తొలగిస్తారని బల్దియా ఉన్నతాధికారులు చెబుతున్నారు. వినాయకులు నిమజ్జనం చేసిన గంటల వ్యవధిలోనే ఈ వ్యర్థాలను తొలగించడం ద్వారా కొంతమేర జల కాలుష్యానికి అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. గ్రేటర్ వరంగల్‌లో 22 చెరువుల్లో కలిపి చిన్న, పెద్దవి కలిపి 15,000 విగ్రహలు నిమజ్జనమైనట్లు బల్దియా అధికారులు చెబుతున్నారు. అధిక మోతాదులో హానికారక రసాయనాలు, వ్యర్థాలు, మూలకాలు నీటిలో ప్రవేశించడంతో జలాయశంలో ప్రతీ లీటరు నీటిలో జీవరాశుల మనుగడకు అత్యావశ్యకమైన బయాలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరగడం, అదేసమయంలో నీటిలో ఆక్సిజన్ స్థాయి పడిపోతుందన్న ఆందోళన ఉంది. ఇది ప్రతి లీటరు నీటిలో సున్నాగా నమోదయ్యే ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ చెరువుల్లో చేపల పెంపకం ఎక్కువగా ఉండడంతో మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏటా నిమజ్జనం అనంతరం
చెరువుల్లో లభ్యమయ్యే వ్యర్థాలు
గ్రేటర్ నగరంలోని చెరువులు: 22
ఘన వ్యర్థాలు: 5 వేల టన్నులు
అధిక గాఢత ఉన్న రసాయనాలు: 10 వేల లీటర్లు
ఇనుము: 100 టన్నులు,
కలప: 50 టన్నులు,
పీఓపీ: 20 టన్నులు
గ్రేటర్ వరంగల్‌లోని 22 చెరువుల్లో వేల టన్నుల వ్యర్థాలు
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఘన వ్యర్థాల
తొలగింపుపై నిర్లక్ష్యం
రోజుల వ్యవధిలో తొలగిస్తేనే
జలచరాలకు మంచిది
బతుకమ్మ తర్వాతే తొలగింపు
ఉంటుందనడంతో ఆందోళన
ప్రజలకు డెంగీ, మలేరియా ప్రబలే
అవకాశం
త్వరగా వ్యర్థాలు తొలగించాలంటున్న పర్యావరణ ప్రేమికులు
వెంటనే వ్యర్థాలు తొలగించాలి..
చెరువుల్లో చేపలు, పక్షులు, వృక్ష, జంతు, అణుకీటకాల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతోంది. భూగర్భజలాలు హాని కారకాలుగా మారతాయి. ఆయా చెరువుల్లో పట్టిన చేపలను తిన్న వారికి శరీరంలోకి హానికారక మూలకాలు చేరతాయి. చేపల ద్వారా మానవ శరీరంలోకి మెర్క్యురీ మూలకం చేరితే మెదడులో సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలే అవకాశముంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని నిమజ్జనం జరిగిన గంటల వ్యవధిలోనే వ్యర్థాలను తొలగించాలి.
– పెరుమాండ్ల లక్ష్మణ్,
చెరువుల పరిరక్షణ సొసైటీ అధ్యక్షుడు
తక్షణమే చర్యలు తీసుకోవాలి
చెరువుల్లో నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాల వ్యర్థాల తొలగింపునకు చర్యలు తీసుకోవాలి. ఆలస్యమైతే ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారైన విగ్రహాలు, రసాయనాలతో పూసిన రంగులు చెరువులో కలిసి చేపలు మృత్యువాత పడతాయి. మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోకముందే వినాయక విగ్రహాల వ్యర్థాలను వెంటనే తొలగించాలి.
– శీలం సాంబయ్య, అల్లీపురం, వరంగల్

ఆలస్యం.. జలచరాలకు విషం!

ఆలస్యం.. జలచరాలకు విషం!