
పల్లెలకు పాలనాధికారులు
నల్లబెల్లి: శాఖల మధ్య సమన్వయం పెంచేందుకు, గ్రామాల్లో ప్రజలకు పారదర్శకంగా సేవలందించేందుకు ప్రభుత్వం గ్రామ పాలన అధికారుల (జీపీఓ)ను నియమించింది. జిల్లాలో నియమితులైన 165 మంది ఈ నెల ఐదో తేదీన హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో హైటెక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. వీరందరికీ రెండు రోజుల్లో కలెక్టర్ సమక్షంలో పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించి మెరిట్ ఆధారంగా క్లస్టర్ల వారీగా పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రధానంగా సొంత మండలం, నియోజకవర్గంలో నియమించరాదని నిబంధన విధించింది. గ్రామపాలన అధికారి పోస్టుల భర్తీకి గతంలో వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలుగా పనిచేసిన వారు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం వీరికి పరీక్షలు నిర్వహించి అర్హులను జీపీఓలుగా ఎంపిక చేసింది. నియామకపత్రాలు అందుకున్న వారిని క్లస్టర్ల వారీగా నియమించనుంది. వీరి నియామకంతో గ్రామాల్లో రెవెన్యూ, భూముల వివాదాలు త్వరగా పరిష్కారంకానున్నాయి. ప్రజలు మండల కేంద్రాల్లో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుంది. పంచాయతీ, రెవెన్యూ, వైద్య, విద్య తదితర శాఖల మధ్య సహకారం పెరుగుతుంది. జిల్లాలో 174 రెవెన్యూ క్లస్టర్లు.. 191 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
జీపీఓల విధులు..
● గ్రామ పరిపాలన అధికారులు గ్రామ స్థాయిలో రెవెన్యూ, పరిపాలన సేవల సమన్వయకర్తలుగా ఉంటారు.
● ధ్రువపత్రాల జారీకి సంబంధించి విచారణ చేయాలి. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నీటి వనరులను కాపాడాలి.
● సర్వేయర్లకు సహకరించి, భూవివాదాలను పరిష్కరించాలి.
● విపత్తుల సమయంలో దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టడంతోపాటు గ్రామాల్లో అత్యవసర సేవలు అందించాలి.
● ఎన్నికల విధుల్లో సిబ్బందికి సాయం చేయాలి. మండలంలోని అధికారులతో సమ్వయంతో కలిసి పనిచేయాలి.
● ప్రభుత్వం, భూపరిపాలన ప్రధాన కమిషనర్, కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ స్థాయి అధికారులు ఏపని అప్పగించినా చేయాలి.
165 మందికి నియామక పత్రాలు
అందించిన సీఎం రేవంత్‌రెడ్డి
రెండు రోజుల్లో కౌన్సెలింగ్,
మెరిట్ ప్రాతిపదికన పోస్టింగ్
గ్రామాల్లో పరిష్కారం కానున్న
రెవెన్యూ, భూ సమస్యలు
జిల్లాలో 174 రెవెన్యూ క్లస్టర్లు..
191 రెవెన్యూ గ్రామాలు