
మంజూరు నుంచి పంపిణీ వరకు అవాంతరాలే..
సాక్షిప్రతినిధి, వరంగల్:
.. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పథకం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోక్షం కలగడం లేదు. నిర్మాణాలు పూర్తయినా ఇండ్ల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఫలితంగా మూడేళ్ల కిందట పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పంపిణీకి నోచుకోక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వివిధ స్థాయిల్లో నిలిచిపోయిన నిర్మాణాల్లో గడ్డి, ముళ్లపొదలు ఏర్పడ్డాయి. పంపిణీ చేసిన వాటిలో సరైన మౌళిక సదుపాయాలు లేక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకాశం రాక అర్హులైన వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా అసంపూర్తి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, పూర్తయిన వాటిని పంపిణీ చేయాలన్న డిమాండ్ వస్తుంది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో అవకాశం రాని వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.
నెరవేరని సొంతింటి కల...
పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సొంతింటికలను సాకారం చేసే లక్ష్యంతో, గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని అమలు చేసింది. ఉమ్మడి వరంగల్‌లో ఈ పథకం కింద రెండు విడతల్లో 26,284 ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో అధికారులు చెబుతున్న ప్రకారం సుమారు రూ.860 కోట్ల వరకు ఖర్చు చేసి 10,939 (41.62 శాతం) ఇళ్లు పూర్తి చేశారు. అందులో నుంచి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి 4,874 (44.56 శాతం) రెండు పడకల గదుల ఇళ్లను పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా మంజూరైన మొత్తం 26,284లలో 4100 వరకు వివిధ కారణాలతో నిర్మాణాలు మొదలు పెట్టలేదు. నిర్మాణాలు ప్రారంభించిన 22,184 ఇళ్లలోలో 10,939 పూర్తయ్యాయి. 11,245 ఇళ్లు వివిధ స్థాయిల్లో నిర్మాణ దశలోనే నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా పలు చోట్ల కొన్నేళ్ల క్రితం చేపట్టిన ఈ ఏళ్ల నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదు. పూర్తయిన 10,939 ఇళ్లలో 4,874 ఇళ్ల్లు మాత్రమే పంపిణీ చేశారు. 6,065 ఇళ్ల మంజూరులో జాప్యం జరుగుతుండడంతో ఉండడానికి గూడులేక వేలాది మంది నిరుపేదలు ఏళ్లపాటు గుడిసెల్లో జీవిస్తూ పక్కా ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
జిల్లా మంజూరు పూర్తి పంపిణీ
హనుమకొండ 4,326 2,143 1,200
వరంగల్ 6,350 2,350 1,250
జేఎస్ భూపాలపల్లి 3,882 1,615 710
జనగామ 4,400 1,600 750
ములుగు 1,800 950 300