
యూరియా కోసం బారులు
ఖానాపురం: మండలంలోని అశోక్‌నగర్‌లో రైతులు యూరియా కోసం భారీగా బారులు తీరారు. శనివారం ఉదయం 555 బస్తాల యూరియా రాగా.. అశోక్‌నగర్, చిలుకమ్మతండా, పర్శతండా, అయోధ్యనగర్ తదితర గ్రామాల నుంచి సుమారు 1200 మంది రైతులు వచ్చారు. తోపులాట జరిగి మహిళలు కొట్టుకున్నారు. దీంతో యూరియా పంపిణీని అధికారులు గ్రామ పంచాయతీ కార్యాలయానికి మార్చారు. టోకెన్లు ఇవ్వడంలో వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం చేయగా రైతులు, సీపీఎం నాయకులు అశోక్‌నగర్‌లో రాస్తారోకో చేశారు. అనంతరం టోకెన్లు ఇచ్చి రాస్తారోకోను విరమింపజేశారు. టోకెన్ల పంపిణీని ఏడీఏ దామోదర్‌రెడ్డి పరిశీలించారు. ఎస్సై రఘుపతి, సొసైటీ సీఈఓ ఆంజనేయులు రైతులకు సర్దిచెప్పి యూరియా పంపిణీ సజావుగా సాగించారు. ఒక్కో రైతుకు ఒక్కో బస్తాను మాత్రమే ఇచ్చారు. యూరియా అందని రైతులు భారీగా వెనుదిరిగిపోయారు.