
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
● తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు
న్యూశాయంపేట: బేషరతుగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గజ్జల రామ్‌కిషన్, కన్వీనర్ ఫణికుమార్ డిమాండ్ చేశారు. పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా హనుమకొండ అంబేడ్కర్ జంక్షన్ నుంచి వరంగల్ కలెక్టరేట్ కార్యాలయం వరకు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అన్ని శాఖల ఉద్యోగ, ఉపాధ్యాయ గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో వరంగల్ కలెక్టర్ సత్యశారదకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాంకిషన్ మాట్లాడుతూ ఉద్యోగులకు శాపంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని సూచించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తమ మొండి వైఖరిని విడనాడాలన్నారు. కార్యక్రమంలో ఆకుల రాజేందర్, రాంరెడ్డి, అన్నమనేని జగన్‌మోహన్ రావు, గాజె వేణుగోపాల్, రాజ్‌కుమార్, టి.కుమార్, సృజన్‌ప్రసాద్, గంగాధర్, అశోక్, కిషన్, సదానందం, తదితరులు పాల్గొన్నారు.