
రూ.వంద కోట్ల విలువైన చెరువు కబ్జా
హసన్‌పర్తి: గోపాలపురం ఊర చెరువు కబ్జాకు గురైనట్లు అధికారులు నివేదించారు. ఆక్రమణకు గురైన ఎనిమిదెకరాల భూమి విలువ ప్రస్తుతం సుమారు రూ.వంద కోట్లుగా చెప్పొచ్చు. ఇక్కడ ఎకరాకు రూ.10 కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు ధర పలుకుతోంది.
ఆక్రమణలో ఎనిమిది ఎకరాలు
హనుమకొండ మండలం గోపాలపురం ఊర చెరువు సర్వే నంబర్ 89లో సుమారు 23.10 ఎకరాల భూమి ఉంది. గతంలో ఈ చెరువు కింద సుమారు రెండు వందల ఎకరాల ఆయకట్టు ఉండేది. నగరం సమీపంలో ఉండడం వల్ల వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారాయి. సుమారు 3.09 ఎకరాల చెరువు శిఖాన్ని ఓ రియల్టర్ కబ్జా చేసి వెంచర్ చేసినట్లు స్థానికులు తెలిపారు. పక్క సర్వే నంబర్ 90తో రిజిస్ట్రేషన్ చేసి సుమారు 60 ప్లాట్లు విక్రయించినట్లు వివరించారు. మరో ఐదెకరాల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయని, కొంతమంది బడాబాబులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ప్లాట్లు చేసి విక్రయించారని ప్రజలు చెబుతున్నారు. ఇలా సుమారు ఎనిమిది ఎకరాల మేర చెరువును కబ్జాదారులు ఆక్రమించారు. ఎఫ్‌టీఎల్‌తో పాటు బఫర్ జోన్ ప్రాంతం కూడా కబ్జాకు గురైంది. శ్మశాన వాటిక లేకపోవడం వల్ల చెరువులోని కొంత ప్రాంతాన్ని గోపాలపురం వాసులు వినియోగించుకుంటున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా వెంచర్
నిబంధనలకు విరుద్ధంగా చెరువలో వెంచర్ వెలిసింది. ఆయా శాఖల అధికారులు మాముళ్లు తీసుకుని వెంచర్‌కు అనుమతి ఇచ్చారని స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నీటి పారుదలశాఖ అధికారులు నిరభ్యంతర పత్రాలు జారీ చేయడం వల్ల వెంచర్ వెలచినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ అధికారులు కూడా లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. చెరువు మత్తడి మాయమైంది. దీంతో చెరువులోకి వరద వచ్చినప్పుడు సమీపంలోని ఇళ్లు ముంపునకు గురవుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చెరువులో నుంచి తాత్కాలిక రోడ్డు కూడా నిర్మించారు.
చెరువులో నిర్మాణాలు ఉంటే
తొలగిస్తాం
చెరువును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తేలితే వాటిని తొలగిస్తాం. కబ్జాదారులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. కబ్జాకు గురికాకుండా చెరువుకు ఉన్నతాధికారులు హద్దులు నిర్ధారించాలి.
– కేఆర్.నాగరాజు, ఎమ్మెల్యే, వర్ధన్నపేట
శిఖంలో వెలిసిన వెంచర్.. అక్రమ నిర్మాణాలు
చెరువులో తాత్కాలిక రోడ్డు నిర్మాణం
హైకోర్టులో పిటిషన్ ఉన్నా ఆగని కట్టడాలు
కలెక్టర్‌కు నివేదిక
ఎనిమిది ఎకరాల మేర గోపాలపురం చెరువు కబ్జాకు గురైందని నీటి పారుదలశాఖ అధికారులు జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. అక్రమ నిర్మాణాలు వెలశాయని పేర్కొన్నారు. ఈ మేరకు 2021లో ఆ ప్రాంతానికి చెందిన తుపాకుల దశరథం.. హైకోర్టులో పిటిషన్ వేశాడు. కలెక్టర్, నగర కమిషనర్, నీటి పారుదలశాఖతో పాటు ఎనిమిది విభాగాలకు చెందిన అధికారుల పేర్లను పిటిషన్‌లో పొందుపర్చాడు. దాంతో రెండేళ్ల క్రితం హైకోర్టు నోటీసులు జారీచేసింది.

రూ.వంద కోట్ల విలువైన చెరువు కబ్జా