
వ్యతిరేక ప్రచారంతోనే భద్రకాళి బోనాలు రద్దు
● మంత్రి కొండా సురేఖ
● వంచనగిరి కోట గండి మైసమ్మకు ప్రత్యేక పూజలు
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని వంచనగిరి కోట గండి మైసమ్మ ఆలయంలో ఆదివారం బోనాల ఉత్సవం ఘనంగా జరిగింది. ఈఉత్సవాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబ సమేతంగా హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. తాను భద్రకాళి అమ్మవారి బోనాలను వైభవంగా నిర్వహించాలని కోరుకున్నానని, అయితే కొంత మంది వ్యతిరేక ప్రచారం చేయడంతో వెనక్కి తగ్గినట్లు తెలిపారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడుతూ.. తనకు కోట మైసమ్మ తల్లి తప్ప ఇతర విషయాలేవీ తెలియవని పేర్కొన్నారు.
నేటి గ్రేటర్ గ్రీవెన్స్ రద్దు
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)లో సోమవారం నిర్వహించనున్న గ్రీవెన్స్ సెల్‌ను రద్దు చేసినట్లు కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యాలయానికి సెలవు ఉంటుందని పేర్కొన్నారు. నగర ప్రజలు బల్దియా ప్రధాన కార్యాలయానికి రావొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
23 నుంచి కేయూ ఎంబీఏ
రెండో సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఎంబీఏ రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 23 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసీంఇక్బాల్ తెలిపారు. ఈనెల 23, 25, 28, 30, ఆగస్టు ఒకటి, నాలుగో తేదీల్లో పరీక్షలు జరుగుతాయని వారు పేర్కొన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.
పర్యాటకుల సందడి
వాజేడు: మండల పరిధి చీకుపల్లి సమీపంలోని బొగత జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సెలవు కావడంతో పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రకృతి అందాలు చూసి ఫిదా అయ్యారు. జలపాతం జలధారలను వీక్షించడంతో పాటు సెల్‌ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు. కొలనులో స్నానాలు చేయడంతో పాటు ఫొటోలు, సెల్ఫీలు దిగారు.

వ్యతిరేక ప్రచారంతోనే భద్రకాళి బోనాలు రద్దు