
అద్దె లేదు.. ఆదాయం రాదు!
పరకాల : పరకాల వ్యవసాయ మార్కెట్‌కు ఆదాయం పెరుగుతుందనే ఆలోచనతో గత పాలకులు కోట్ల నిధులు ఖర్చు చేసి నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ అద్దెకు ఇవ్వకపోవడంతో రెండేళ్లుగా నిరుపయోగంగా ఉంది. దీంతో వ్యవసాయ మార్కెట్ ఏడాదికి రూ.5లక్షల ఆదాయం కోల్పోతుంది. గత పాలకవర్గం రాష్ట్ర మార్కెటింగ్ శాఖకు తప్పుడు నివేదిక ఇవ్వడంతోనే నేడు ఇబ్బందికరంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం పరకాల మార్కెట్ ముందు భాగంలోని ఖాళీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని, అందుకు కావాల్సిన నిధులపై మార్కెట్ శాఖకు అప్పటి పాలకవర్గం ప్రతిపాదనలు పంపింది. ఒక్కో షట్టర్ ద్వారా నెలకు రూ.4,250 ఆదాయం వస్తుందన్న అంచనాలతో రూ.1.98 కోట్లతో 20 షట్టర్లు నిర్మించి 2023లో ప్రారంభించారు. కానీ పాలకవర్గం నిర్ణయించిన మార్కెట్ ధరకు వ్యాపారస్తులు ఎవరూ అద్దె చెల్లించేందుకు సుముఖత చూపకపోవడంతో నిరుపయోగంగా ఉండి పోయాయి. ఒక గది నిర్మాణమే తప్ప సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయకపోవడంతో వ్యాపారస్తులు ఇబ్బందిగా భావిస్తున్నారు. రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ వ్యాపారస్తులకు అందుబాటులోకి తెచ్చి అద్దెకు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. 100 పడకల ఆస్పత్రితో పాటు మార్కెట్‌కు వచ్చే వారికి సమీపంలో భోజనం, టిఫిన్ సెంటర్లు అందుబాటులో లేకపోవడంతో షట్టర్లను తక్కువ కిరాయికి ఇస్తే మంచి డిమాండ్ ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
నిరుపయోగంగా పరకాల
మార్కెట్‌లోని షాపింగ్ కాంప్లెక్స్
మార్కెట్ ధరకు ముందుకు రాని వ్యాపారస్తులు
అద్దెను సవరిస్తూ కొత్త పాలకవర్గం ప్రతిపాదనలు

అద్దె లేదు.. ఆదాయం రాదు!