
మాంకాళీ శరణం మమః
యేపరిల్లల తోరణాలు.. గణగణనాదాల కాళ్ల గజ్జెలు.. ధనధన డప్పుల దరువు మోతలు.. రెట్టించి సప్పుడు జేసే ఢమరుక వాయిద్యాలు.. పసుపు పూసుకున్న పోతరాజులు.. వీపును వాయించే వీరగోనెలు.. జడితిచ్చే కోళ్లు, మేకలు.. నెత్తిన చేరిన బోనాల మిద్దెలు.. వీటన్నింటి నడుమన మాంకాళికి మనసారా మొక్కులు.. కాజీపేట 63వ డివిజన్ విష్ణుపురి మహంకాళి దేవాలయంలో ఆదివారం బోనాల జాతర వైభవంగా నిర్వహించారు. ఆషాఢమాసం చివరి ఆదివారం అమ్మవారిని దర్శించుకోవడం భక్తులకు ఆనవాయితీగా వస్తోంది. పురవీధుల్లో అమ్మవారిని ప్రత్యేక రథంపై ఊరేగించారు. దాదాపు 70 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. – కాజీపేట