
ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలి
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలోని ఆయిల్ పామ్ పంటలు సాగు చేసే రైతులను ప్రోత్సహించాలని అధికారులను కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలోని వివిధ మండలాల్లో ఆయిల్ పామ్ పంట సాగు వివరాలను కలెక్టర్‌కు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంటల ప్రాముఖ్యతను రైతులకు అధికారులు వివరిస్తూ అధిక విస్తీర్ణంలో సాగయ్యే విధంగా కృషి చేయాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే ఆయిల్ పామ్ పంట సాగును వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ప్రోత్సహించాలని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఉన్న ఆయిల్ పామ్ సాగు స్కీం ఈ సంవత్సరంతో ముగుస్తున్నందున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సెరికల్చర్‌లో ప్రగతి సాధించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఉద్యాన శాఖకు సంబంధించిన బుక్‌లెట్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి అనసూయ, సెరికల్చర్ అధికారులు సంజీవరావు, వెంకన్న, మండల వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
కాజీపేట అర్బన్ / మడికొండ: కాజీపేట మండలంలోని తహసీల్దార్ కార్యాలయం, పీహెచ్‌సీ, ప్రభుత్వ పాఠశాలలను హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, పుస్తకాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. కాజీపేట తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, భూభారతి రెవెన్యూ సదస్సుకు వచ్చిన దరఖాస్తుల వివరాలను తహసీల్దార్ భావ్‌సింగ్‌ను అడిగి తెలుసుకున్నారు. కడిపికొండ గ్రామంలోని పీహెచ్‌సీని సందర్శించి రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. మడికొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థుల నమోదును ఆన్‌లైన్‌లో (ఫేషియల్ రికగ్నేషన్ సిస్టం–ఎఫ్‌ఆర్‌ఎస్) తప్పనిసరిగా నమోదు చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మధ్యాహ్నం భోజనం మెనూ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో డీఎంహెచ్‌ఓ అప్పయ్య, డీఈఓ వాసంతి, కడిపికొండ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ శ్రీదేవి, కాజీపేట ఎంఈఓ మనోజ్‌కుమార్, మడికొండ జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం సంధ్యారాణి, ఎంపీపీఎస్ హెచ్‌ఎం మల్లారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలి