
ఇక నూతన విధానం
నర్సంపేట: పత్తి కొనుగోలుకు కేంద్రం నూతన విధానం అమలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ధర వ్యత్యాస చెల్లింపు పథకం(పీడీపీఎస్) పేరిట అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. మార్కెట్‌లో రైతులకు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధర లభిస్తే.. ఆ వ్యత్యాసాన్ని కేంద్రం భరించడమే ఈ పథకం ఉద్దేశం. ఈ వ్యత్యాసాన్ని పూడ్చేందుకు కనీస మద్దతు ధరలో 15 శాతం చెల్లిస్తుంది.
ప్రైవేట్ వ్యాపారుల కొనుగోలు..
రైతులకు కనీస మద్దతు ధర చెల్లించాలనే ఉద్దేశంతో తీసుకొస్తున్న ఈ నూతన పథకం అమలైతే... సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లు నిలిచిపోతాయి. గుర్తింపు పొందిన ప్రైవేట్ వ్యాపారాలు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాగా, ఈ విధానంలో ఆ మార్కెట్లో వారం రోజుల సరాసరి ధరలను పరిగణనలోకి తీసుకొని మొదట క్వింటా ధర నిర్ణయిస్తారు. ఆపై కనీస మద్దతు ధర కంటే తక్కువ ధర వచ్చిన రైతులకు 15 శాతం పీడీపీఎస్ చెల్లిస్తారు.
మద్దతు ధర రూ.8,110
2025–26 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధర రూ.8,110 నిర్ణయించింది. ఇందులో 15 శాతాన్ని అంటే గరిష్టంగా రూ.1,216 రైతులకు జమ చేస్తుంది. ఉదాహరణకు ఒక రైతు క్వింటా పత్తికి రూ.6,800 ధర వచ్చింది. మరి కొంత మంది రైతులకు రూ.6,500 నుంచి రూ.8 వేలు పడింది. ఇలా వారంలో వచ్చిన పత్తి సరాసరి ధరను రూ.7,500 నిర్ణయించారనుకుందాం. కాగా, కనీస మద్దతు ధర రూ.8,110 అయినందున మొదటి రైతు రూ.1,310 నష్టపోతాడు. కానీ, కేంద్ర ప్రభుత్వం మొత్తం చెల్లించదు. కనీస మద్దతు ధర రూ.8,110, సగటు ధర రూ.7,500 ఉన్నందున సగటు ధర కంటే ఎక్కువ ఉన్న మొత్తాన్ని అంటే రూ.560 మాత్రమే చెల్లిస్తుంది. అంటే ఆ రైతుకు ఏడు శాతం మాత్రమే వర్తిస్తుంది. దీని వల్ల కూడా రైతు నష్టపోయే అవకాశం ఉంది.
పైలట్‌గా వరంగల్...
గత సీజన్‌లో సీసీఐ కొనుగోళ్లలో జరిగిన అవకతవకలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం పీడీపీఎస్ విధానాన్ని అమలులోకి తీసుకొస్తుంది. ఈ మేరకు రాష్ట్రంలోని మూడు మార్కెట్లను పైలట్‌గా ప్రకటించింది. ఆదిలాబాద్, నల్గొండతోపాటు వరంగల్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు వరంగల్‌లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు జరుగుతుంది.
వ్యాపారుల చేతివాటం..
పీడీపీఎస్ విధానం వల్ల వ్యాపారులు అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమాయక రైతులను మచ్చిగా చేసుకొని తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేసినట్లు చూపించి ఎక్కువ మొత్తంలో కాజేసే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అయితే ఈ విధానం అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
పీడీపీఎస్ పద్ధతిలో పత్తి సేకరణ
కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉంటే కేంద్రం చెల్లించేలా చర్యలు
పైలట్ ప్రాజెక్టుగా
వరంగల్ జిల్లా ఎంపిక
జిల్లాలో పత్తిసాగు ఇలా..
ఏడాది ఎకరాలు
2024 1,20,166
2025 1,26,173