ఆయిల్‌పామ్‌... సాగు లాభదాయకం | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌... సాగు లాభదాయకం

Jul 7 2025 6:00 AM | Updated on Jul 7 2025 6:00 AM

ఆయిల్‌పామ్‌... సాగు లాభదాయకం

ఆయిల్‌పామ్‌... సాగు లాభదాయకం

దుగ్గొండి: అన్నదాతలు ప్రతియేటా ఒకేరకమైన పంటలు సాగుచేయడం వల్ల ఆశించిన అభివృద్ధి సాధించడంలో వెనుకబడిపోతున్నారు. కొన్ని పంటలనే రైతులు విరివిగా సాగుచేయడం.. ఆయా పంటలు చేతికొచ్చాక విక్రయించడంలోనూ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తక్కువ పెట్టుబడితో సుదీర్ఘకాలంపాటు అన్నదాతకు సిరులు కురిపించే ఆయిల్‌పామ్‌ సాగును ఎంచుకుంటే రైతులు ప్రగతి సాధిస్తారని నర్సంపేట డివిజన్‌ ఉద్యానశాఖ అధికారి అలకొండ జ్యోతి సూచిస్తున్నారు.

సాగువిధానం...

ఆయిల్‌పామ్‌ పంట వేయడానికి బంక నేలలు, చౌడు నేలలు పనికిరావు. నీటి సౌకర్యం ఉన్న అన్ని నేలలు అనుకూలంగానే ఉంటాయి. నీటి సౌకర్యం ఉండి గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలు చాలా అనుకూలం. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అన్నీ నేలలు, వాతావరణం ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఎకరా భూమిలో 57 మొక్కలు, హెక్టార్‌ అయితే 143 మొక్కలు నాటాల్సి ఉంటుంది. మొక్కకు మొక్కకు సాలుకు సాలుకు మధ్య 9 మీటర్ల ఎడంతో నాటుకోవాలి. మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటగా వరి తప్ప అన్ని పంటలు సాగుచేసుకోవచ్చు. 4వ సంవత్సరం నుంచి ఆయిల్‌పామ్‌ తోటలో దుక్కి దున్నకూడదు. 7వ సంవత్సరం నుంచి ఆయిల్‌పామ్‌ తోటలో అంతరపంటగా కోకో పంటను సాగుచేసుకోవచ్చు. దీని వల్ల ఎకరాకు ఏడాదికి రూ.30 వేల నుంచి రూ.40 వేల అదనపు ఆదాయం వస్తుంది. డ్రిప్‌ద్వారా లేదా మినీ స్ప్రింకర్ల ద్వారా సాగునీటిని అందించడం మేలు. డ్రిప్పును ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో అందిస్తుంది. సేంద్రియ ఎరువులద్వారా పంట పండిస్తే అధిక దిగుబడి వస్తుంది. ఎకరాకు నేలను బట్టి 10 నుంచి 20 టన్నుల గెలల దిగుబడి వస్తుంది. టన్ను గెలలకు మార్కెట్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.19 వేల నుంచి గరిష్టంగా రూ.21 వేలు ఉంది. ఎకరాకు సాగు ఖర్చు రూ.20 వేలు అవుతుంది. కనీసం 10 టన్నుల దిగుబడి వచ్చినా రూ.2 లక్షలు వస్తాయి. ఖర్చులు పోగా రూ.1.80 లక్షల నికరాదాయం వస్తుంది. పంట వేసిన నాలుగో సంవత్సరం నుంచి 25 –30 సంవత్సరాల వరకు పంట దిగుబడి వస్తూనే ఉంటుంది. ప్రతి యేటా జూన్‌ నుంచి ఫిబ్రవరి వరకు గెలల దిగుబడి వస్తూనే ఉంటుంది. నూనె దిగుబడి 17 నుంచి 22 శాతం వరకు వస్తుంది.

ప్రభుత్వ సబ్సిడీ...

ప్రభుత్వం ఆయిల్‌ పామ్‌ సాగుచేసే రైతులకు మొక్కలపై 90 శాతం సబ్సిడీ ఇస్తుంది. మొక్క ధర రూ.193 ఉండగా రైతు కేవలం రూ.20 చెల్లిస్తే సరిపోతుంది. పంట మొదటి నాలుగు సంవత్సరాల వరకు ఎరువుల కోసం ఎకరాకు ఏడాదికి రూ.4,200 సబ్సిడీగా అందిస్తుంది. పంట కోత, గెలల రవాణాకు ప్రభుత్వం ఉద్యాన శాఖ నుంచి సబ్సిడీ అందిస్తుంది.

ప్రకృతి వైపరీత్యాల్లోనూ నష్టం ఉండదు..

ఆయిల్‌ పామ్‌ పంట తుపానులు వచ్చినా, వరదలు వచ్చినా ఎలాంటి నష్ట జరగదు. కోతులు, ఇతర పక్షులు, జంతువుల బెడద ఉండదు. పర్యావరణానికి హితంగా ఉండి సకాలంలో వర్షాలు కురవడానికి దోహదపడుతుంది.

మొదలైన పంట దిగుబడి..

నర్సంపేట డివిజన్‌ వ్యాప్తంగా 2022లో ఆయిల్‌పామ్‌ పంట సాగు ప్రారంభమైంది. ఇప్పటికి 2,500 ఎకరాల్లో తోటలు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం సాగు చేసిన రైతులకు ఈ నెలలో తొలి పంట చేతికి రానుంది. ఇందుకోసం ఎక్కడికో ప్యాక్టరీకి రైతు వెళ్లే అవసరం లేకుండా నర్సంపేట మండలంలోనే పికప్‌ పాయింట్‌ ఏర్పాటు చేశారు. రైతులు అక్కడి వరకు తెస్తే సరిపోతుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి పంట కోతకు వస్తూనే ఉంటుంది.

తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి

ప్రకృతి వైపరీత్యాల్లోనూ ఆదాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement